మండే వేసవిలో తాజాగా ఉండాలంటే.. ఈ మూడు జ్యూసులు బెస్ట్..!

 


వేసవి కాలం వచ్చేసరికి శరీరంలో నీటి లోపం, డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. మండే ఎండలు,  తేమతో కూడిన వేడి కారణంగా అలసట, నీరసం,  చిరాకుగా అనిపించడం సర్వసాధారణం. చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు ఎనర్జీగా వెళతారు.  తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వాడిపోయిన తోటకూర కాడలా కనిపిస్తారు.  అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం  కేవలం నీళ్లు తాగితే సరిపోదు. ఆరోగ్యకరమైన జ్యూస్‌లు తీసుకోవాలి.  ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వేసవిలో తీసుకునే  జ్యూస్‌లు  శరీరాన్ని చల్లబరచడమే కాకుండా  శక్తిని కూడా ఇస్తాయి. ఈ మండే ఎండలో శరీరాన్ని తాజాగా ఉంచే మూడు జ్యూస్‌ల గురించి తెలుసుకుంటే..

పుచ్చకాయ నీటి కొరతను తొలగిస్తుంది..

పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో ఉత్తమమైన హైడ్రేటింగ్ పండుగా మారుతుంది. దీనిలో ఉండే ఎలక్ట్రోలైట్లు,  యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని శుద్ది  చేయడమే కాకుండా హైడ్రేషన్ స్థాయిని కూడా బ్యాలెన్స్ గా ఉంచుతాయి. ఇది శరీరంలో నీటి కొరతను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆమ్లత్వం నుండి ఉపశమనం ఇస్తుంది. చర్మాన్ని తాజాగా,  ప్రకాశవంతంగా ఉంచుతుంది. పుచ్చకాయ ముక్కలను మిక్సర్‌లో వేసి, కొంత నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి బ్లెండ్ చేయాలి.  కావాలంటే దానికి నల్ల ఉప్పు,  కొద్దిగా తేనె కూడా జోడించవచ్చు.

కొబ్బరి నీరు సహజమైన,  ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి..

వేసవిలో కొబ్బరి నీళ్లు అత్యంత సహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి. ఇందులో ఎలక్ట్రోలైట్స్, ఖనిజాలు,  విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  నిమ్మరసంతో కలిపి తాగినప్పుడు ఇది అద్భుతమైన శక్తిని పెంచే పానీయంగా మారుతుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వేడి,  వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో నిమ్మకాయ, నల్ల ఉప్పు కలిపి తాగవచ్చు.

దోసకాయ తాజాదనాన్ని కాపాడుతుంది..

దోసకాయలో 96 శాతం నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేసి చల్లదనాన్ని అందిస్తుంది. అదే సమయంలో పుదీనా సహజ శీతలీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. దోసకాయ శరీరంలో తాజాదనాన్ని కాపాడుతుంది, శరీరం డీహైడ్రేట్ కాకుండా   నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది,  జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దోసకాయ తొక్క తీసి ముక్కలుగా కోసి, పుదీనా ఆకులు, నిమ్మరసం, కొద్దిగా నల్ల ఉప్పు వేసి బాగా బ్లెండ్ చేయాలి. దాన్ని ఫిల్టర్ చేసి చల్లబరిచి త్రాగాలి.

                                 *రూపశ్రీ

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...