మామిడి పండ్లను ఎవరు తినకూడదు?

వేసవికాలం అంటే అందరికి మామిడి పండ్లు గుర్తు వస్తాయి.  మామిడి పండ్ల వాసన నుండి రుచి వరకు ప్రతిదీ ఆకర్షిస్తుంది.  పసుపు రంగులో బాగా పండిన మామిడి పండ్లను తినకపోతే వేసవికాలానికి న్యాయం చేసినట్టే అనిపించదు.  అయితే మామిడి పండ్లు ఎంత రుచిగా ఉంటాయో.. కొందరికి అంతే చేటు చేస్తాయి.  మామిడి పండ్లు మిగతా పండ్ల లాగా ఆరోగ్యానికి చాలా మంచివే అయినా.. కొందరు మామిడిపండ్లు తినడం ఎంత మాత్రం మంచిది కాదు.  పండ్లలో రాజైన మామిడి పండులో ఉండే పోషకాలు ఏంటి? మామిడి పండును ఎవరు తినాలి? ఎవరు తినకూడదు అనే విషయం తెలుసుకుంటే..

పోషకాలు..

మామిడి పండ్లలో విటమిన్-సి,  విటమిన్-ఎ,  విటమిన్-బి9,  విటమిన్-ఇ, ఫైబర్, పొటాషియం,  ఐరన్,  కాపర్,  మెగ్నీషియం వంటి అనేక రకాల పోషకాలు  ఉన్నాయి.  ఈ పోషకాలు శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి.  అయితే మామిడి పండ్లను అందరూ తినడం మంచిది కాదు.  

మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు ఉంటాయి.  ఈ సహజ చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.  మధుమేహం ఉన్నవారు,  కుటుంబంలో మధుమేహం సమస్య ఇప్పటికే ఉన్నవారు మామిడి పండ్లను తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  మధుమేహం ఉన్నవారు అయితే అసలు తినకూడదు.

ఇటీవల కాలంలో పొట్ట సంబంధ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి.  వాటిలో గ్యాస్,  అసిడిటీ,  మలబద్దకం మొదలైనవి ముఖ్యమైనవి.  ఇవి  పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి వస్తున్నాయి.  ఈ సమస్యలు ఉన్నవారు మామిడి  పండ్లు తినకపోవడమే మంచిది.  మామిడిపండ్లను తింటే పై సమస్యలు ఎక్కువ అవుతాయి.

ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇప్పట్లో చాలా పెరుగుతున్నాయి.  ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారు,  చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారు,  జీవక్రియ చాలా బలహీనంగా ఉన్నవారు.  అంటే తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది పడేవారు మామిడి పండ్లను తినకపోవడం మంచిది.  ఎందుకంటే మామిడి పండ్లు పై సమస్యలను ఎక్కువ చేస్తాయి.

లేటెక్స్ కు అలెర్జీ ఉన్నవారు మామిడి పండ్లను తినకూడదు.  ఎందుకంటే మామిడి పండ్లలో ఉండే పోషకాలు,  ప్రోటీన్లు.. లేటెక్స్ లో ఉండే ప్రోటీన్ల మాదిరిగానే ఉంటాయి.  అందుకే మామిడి పండ్లను తింటే ఈ అలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది.

అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు మామిడి పండ్లు తినే విషయంలో చాలా జాగ్రత్త పడాలి.  ఎందుకంటే మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కరెలు ఉంటాయి.  కేలరీలు ఎక్కువ ఉంటాయి.  మామిడి పండ్లను ఎక్కువ తీసుకుంటే బరువు పెరిగే సమస్య మరింత ఎక్కువ అవుతుంది.  

                                 *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...