యమపాశం లాంటి క్షయకు చెక్ పెట్టండి ఇలా...

ఈ మధ్య కాలంలో విస్తృతం అవుతున్న ఆరోగ్య సమస్యలలో టిబి కూడా ఒకటి. దీన్నే క్షయ అని కూడా అంటారు. ఈ క్షయ వ్యాధి చూడడానికి సాధారణ దగ్గులా అనిపించి అయోమయానికి గురి చేస్తుంది. కానీ దీన్ని గురించి తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంతక సమస్యగా  మారే అవకాశం ఉంటుంది. 


ఇంతకూ ఈ క్షయ సమస్య ఎందుకు ఎలా వస్తుంది?? దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?? టిబి సోకిన వారికి చావే గతి అని అంటూ ఉంటారు చాలామంది. అది నిజమేనా లేక అపోహనా?? టిబి నయం అవుతుందా?? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే ఈ సమస్య గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఈ సమస్య నుండి ప్రతి ఒక్కరు తమని తాము కాపాడుకునేందుకు ఆస్కారం వుంటుంది. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…


టి.బి ఎందుకు ఎలా వస్తుంది??


టి.బి అనే దాన్ని క్షయ అని కూడా అంటారు. ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వల్ల వచ్చే సమస్య. ఈ బాక్టీరియా సాధారణ వ్యక్తి పీల్చే గాలి ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశించి క్షయను కలుగజేస్తుంది. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఒకరి నుండి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది.


టిబి సోకిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి??


టిబి లేదా క్షయ వ్యాధి సోకిన వారి లక్షణాలు పైకి కనిపిస్తాయి. విపరీతమైన దగ్గు ఉంటుంది. ఈ దగ్గు కూడా కఫంతో కూడి ఉంటుంది. ఇది సుమారు మూడు వారాలకు పైగా ఉంటే వ్యాధి లక్షణంగా అనుమానించాల్సి ఉంటుంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం, ఆయాసం, తేలికపాటి జ్వరం, శరీరం శుష్కించిపోవడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. దగ్గు క్రమంగా పెరిగితే రక్తంతో కూడిన కఫం పడే అవకాశం కూడా ఉంటుంది.


టిబి సమస్యకు జాగ్రత్తలు ఏమిటి??


టిబి సోకిన వారు అది ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గుతో ఉంటారు కాబట్టి మాస్క్ ధరించాలి. ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయకూడదు. చల్లని వాతావరణానికి తిరగకూడదు. వైద్యులు సూచించిన మందులు వాడుతూ తమ వస్తువులను విడిగా ఉంచుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి.


టిబి సమస్య లేనివారు తమ చుట్టూ టిబి వ్యాధి వ్యాప్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎక్కడంటే అక్కడ తినడం, తాగడం చేయకూడదు. బయట ప్రాంతాలలో ఉమ్మివేయకూడదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు రద్దీ ప్రాంతాలలో తిరిగెటప్పుడు మాస్క్ ధరించాలి. 


టిబి నయం అవుతుందా?? 


టిబి వ్యాధి గురించి పట్టించుకోకపోతే అది ప్రాణాంతకం అయినప్పటికీ దాన్ని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడితే ఆరు నెలలలోపు జబ్బు తగ్గిపోతుంది. కాబట్టి టిబి వస్తే ఇక చావే గతి అనే అపోహను వదిలేయాలి.


క్షయ రోగానికి కేవలం ఇంగ్లీషు వైద్యం మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో కూడా వైద్యం అందుబాటులో ఉంది. ఏ రకం వైద్యం అయినా వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడితే టిబి నయమవుతుంది. చలి మరియు వర్షా కాలంలో ఈ సమస్య మరింత విస్తృతం అయ్యే అవకాశాలు ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలి.


                                   ◆నిశ్శబ్ద.