చరిత్రలో ఎప్పుడూ లేనంత తక్కువగా రూపాయి విలువ
posted on Jun 28, 2018 11:26AM
.jpg)
రూపాయి విలువ ఎప్పుడూ లేనంత దారుణంగా పడిపోయింది. నిన్న సాయంత్రం నాటికే డాలరుకి 68 రూపాయల దగ్గర ఉన్న రూపాయి విలువ ఈవేళ 69 మార్కుని దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఎగిసిపడటం, ద్రవ్యోల్బణం అదుపు తప్పిపోవడం, ఆంతర్జాతీయ మార్కెట్లో ఇతర కరెన్సీలు కూడా బలహీనపడటం వంటి ప్రతికూలతల మధ్య రూపాయి చరిత్రలో లేనంతగా ఒక డాలరుకి 69 రూపాయలకి చేరుకుంది. ఈ సాయంత్రానికి ఇది 70 రూపాయల మార్కుని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. గత కొద్ది నెలలుగా విదేశీ ఇన్వెస్టుమెంట్లు తగ్గిపోవడం కూడా రూపాయి పతనానికి కారణం అని ఊహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్‌బీఐ జోక్యం చేసుకుని నష్టనివారణ చర్యలు చేపట్టాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే పెరిగిపోతున్న పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను రూపాయి క్షీణత మరింత తీవ్రతరం చేయనున్నదని నిపుణులు భయం వ్యక్తం చేస్తున్నారు.