ఉగ్రవాదంపై పోరులో ఇక భారత్ కూడా పాల్గొంటుంది

 

టర్కీలో నిన్న మొదలయిన జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలలో ఉగ్రవాదంపై పోరు ప్రధాన ఎజెండాగా సాగింది. పారిస్ పై జరిగిన ఐసిస్ ఉగ్రవాదుల దాడుల నేపధ్యంలో ఈ రెండు రోజుల సమావేశాలలో పాల్గొన్న దేశాలన్నీ నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని అడ్డుకట్టవేస్తామని శపథం చేసాయి. వాటిలో భారత్ కూడా ఉండటం విశేషం.

 

ఉగ్రవాద భాదిత దేశాలలో ఒకటయిన భారత్, ఇంతవరకు దాని నుండి తనను తాను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తోంది తప్ప ఏనాడూ దాని నిర్మూలన కోసం యూరోప్ దేశాలతో కలిసి నేరుగా రంగంలోకి దిగలేదు. భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి ఉగ్రవాదుల స్థావరాలపై సంకీర్ణ వైమానిక దాడులలో పాల్గొన్నట్లయితే, ఉగ్రవాదులు యూరోప్ దేశాలతో పాటు భారత్ పై కూడా దాడులకు తెగబడినట్లయితే, వారిని అడ్డుకోవడం కష్టమనే ఉద్దేశ్యంతోనే ఇంతకాలం భారత్ ఉగ్రవాదులపై ప్రత్యక్షపోరాటానికి వెనుకంజ వేసినట్లు భావించవచ్చును. అయినా ఉగ్రవాదుల కళ్ళు భారత్ పై కూడా పడ్డాయని కాశ్మీర్ లో రెపరెపలాడుతున్న వారి జెండాలు, చాప క్రింద నీరులా దేశం నలుమూలల చేరుతున్న వారి సానుభూతిపరులను గమనిస్తే అర్ధమవుతుంది.

 

ఉగ్రవాదులపై భారత్ ప్రత్యక్ష పోరాటానికి దిగినా దిగకపోయినా వారు భారత్ ని వదిలిపెట్టబోరనే విషయం స్పష్టం అవుతోంది. అందుకే జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలలో భారత్ కూడా ఉగ్రవాదంపై పోరుకి మిగిలిన దేశాలతో చెయ్యి కలిపేందుకు సిద్దపడింది. కానీ ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా నేతృత్వంలో సంకీర్ణ వైమానిక దాడులలో భారత్ పాల్గొనదు కానీ వారికి అడ్డుకట్ట వేసేందుకు జి-20 దేశాలు చేపట్టబోయే అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనబోతోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది చాలా సాహసోపేతమయిన నిర్ణయమేనని చెప్పవచ్చును. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే వేరే మార్గం లేదు. కానీ ఇంకా భయపడుతూ ఉగ్రవాదులను ఉపేక్షిస్తూ కూర్చోవడం అంటే పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొని నివారించే ప్రయత్నం చేయకుండా, భయపడి కళ్ళు మూసుకొని కూర్చోన్నట్లే అవుతుంది. అందుకే భారత్ కూడా ఉగ్రవాదంపై పోరుకి సిద్దం అవకతప్పడం లేదు.

 

జి-20 దేశాల మొదటి రోజు సమావేశంలో సభ్య దేశాలు, ఉగ్రవాదం పెరగడానికి దోహదపడుతున్న కొన్ని అంశాలను గుర్తించాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఆయుధాలు అందకుండా అడ్డుకోవడం వాటిలో ప్రధానమయినది. ఉగ్రవాదులకు వివిధ దేశాలలో ఉన్న వాటి సానుభూతిపరుల నుండి నిధులు అందకుండా చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొన్నాయి. అదే విధంగా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను అన్ని దేశాలకు వ్యాపించేందుకు ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకొంటున్నట్లు గుర్తించిన జి-20 దేశాలు వాటిని ఉగ్రవాదులు వినియోగించకుండా నిరోధించేందుకు అవసరమయిన అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించుకొన్నాయి. ఇకపై అన్ని సభ్యదేశాలు ఒకదానికొకటి సహకరించుకొంటూ పూర్తి సమన్వయంతో ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకొన్నాయి. ఈ నిర్ణయాలను అమలు చేయడంలో భారత్ కి కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏవీ ఉండబోవు కనుక భారత్ కూడా జి-20 దేశాలతో కలిసి పనిచేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu