హైదరాబాద్ లో టీ హబ్ రెండో దశ సిద్ధం.. వరల్డ్ సెకండ్ టాప్ ఇంకు బేటర్!
posted on Sep 13, 2021 10:11AM
సైబరాబాద్ లో నిర్మించిన అతి పెద్ద ఇంక్యుబేటర్ ‘టీ-హబ్’ భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఐటీ అంకురాలు ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా అయిదేళ్ల క్రితం ట్రిబుల్ ఐటీ భవనంలో టీహబ్ ప్రారంభమైంది. 1500కు పైగా అంకురాల స్థాపన ద్వారా రూ.2200 కోట్ల మేరకు పెట్టుబడులను సమీకరించారు. ఈ క్రమంలోనే 350 అంతర్జాతీయ 435 కార్పొరేట్ సంస్థలు టీహబ్ లో భాగస్వామిగా ఉన్నాయి. అంకుర వ్యవస్థతో ప్రత్యక్షంగా 5000మందికి ఉపాధి కలిగింది. ప్రస్తుతం ఉన్న భవనంలో 60 వేల చదరపు అడుగుల మేరకే స్థలం ఉంది. 85కు పైగా ఆవిష్కరణ కార్యక్రమాలను రూపొందించింది.
టీ హబ్ తో కొత్త అంకురాలతోపాటు ఆవిష్కరణల, పరిశోధనలకు ఊపు వచ్చింది. వాటికి డిమాండ్ పెరగడంతో భారీ వైశాల్యంతో కొత్త భవనం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద మూడు ఎకరాల స్థలం ఇస్తూ.. నిర్మాణానికి రూ.276 కోట్లు కేటాయించింది. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభమైనా కరోనా వల్ల గత ఏడాది కొంత మందగించాయి. మొత్తానికి సకల హంగులతో భవనం ప్రారంభానికి సిద్ధమైంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
రెండో దశ టీ హబ్ భవనం పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఆవిష్కరణల జగత్తును సాక్షాత్కారించేలా టీ-హబ్ భవనం అన్ని హంగులతో సిద్ధమైంది. భారత్ లో కెల్లా పెద్దది అని తేల్చారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన ఈ ఇంకు బేటర్ భవనం ద్వారా ఆవిష్కరణల వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. 3.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలంలో 2000 అంకురాలకు ఇది నిలయం కానుందని కేటీఆర్ ట్విట్టర్ లో ఆశాభావం వ్యక్తం చేశారు.