ప్రియాంక సారధ్యంలో హస్త రేఖలు మారేనా?

దేశం మొత్తంలో అత్యధిక (80) లోక్ సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. అంతే కాదు  దేశానికి నెహ్రూ నుంచి మోడీ దాకా ఎనిమిది మంది ప్రధానులను అందించిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. కాంగ్రెస్ ప్రధానులలో అయితే ఒక పీవీ, ఒక మన్మోహన్ మినహా మిగిలిన వారందరూ యూపీ నుంచే పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఒక విధంగా యూపీ కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లు. అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని 1950 నుంచి 1989 వరకు, (మధ్యలో కొద్ది కాలం చరణ్ సింగ్ (లోక్ దళ్) ఇంకొద్ది కాలం జనతా పార్టీ  అధికారంలో ఉన్నా) ఇంచుమించుగా 40 ఏళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. అయితే 1989లో అధికారం కోల్పోయిన తర్వాత గడచిన 32 – 33 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ యూపీలో  మళ్ళీ అధికారంలోకి రాలేక పోయింది. 

ఇక ప్రస్తుతానికి వస్తే కలలోకూడా ఉహించి ఉండని దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టు మిట్టాడుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో  ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అంతకు ముందు 2014 ఎన్నికల్లోనూ అంతే, రెండే రెండు స్థానాల్లో(అమేథి, రాయిబరేలి),సోనియా, రాహుల్ గాంధీ మాత్రమే గెలిచారు. చివరకు 2019లో రాహుల్ కూడా ఓడి పోయారు. పుట్టింట కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానికి పడిపోయింది. ఓట్ల శాతం చూసుకుంటే ఆరు శాతానికి కొంచెం అటూ ఇటుగా ఉంటుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే  2017 ఎన్నికలలో 403 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి దక్కింది కేవలం 7 సీట్లు, 5.38 శాతం ఓట్లు మాత్రమే. అందుకే యూపీలో కాంగ్రెస్ కథ కంచికి చేరినట్లేనన్న అభిప్రాయం బలపడింది. అందులోనూ వచ్చే సంవత్సరం (2022) లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఏవీ కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దంగా లేవు. ఆ కారణంగా, అనివార్యంగా మరో దరి లేక కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేస్తోంది. 

ఇలాంట పరిస్థితిలో కాంగ్రెస్ హస్త రేఖలు మారిపోయి, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవ స్థితి వచ్చేస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది.అయితే, రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును. ప్రస్తుతం 303 స్థానాల సొంతబలంతో  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి  ఒకప్పుడు రెండే లోక్ సభ స్థానాలున్న విషయాన్నీ మరిచి పోరాదు. అలాగే, సూది మొనంత చోటులేని అస్సాం, త్రిపుర, మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాలలో ఐదేళ్లలోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ విషయాన్నే తీసుకున్నా, 2012 ఎన్నికల్లో బీజేపే బలం రెండంకెల సంఖ్య (47) దగ్గరే ఆగిపోయింది. అదే  2017 నాటికి ఏకంగా 312కు ఎగబాకింది. సమాజవాదీ పార్టీ బలం 224 నుంచి 47కు దిగివచ్చింది. సో .. రాజకీయాలలో ఏదైనా జరగవచ్చును. ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం ఎవరూ కాదనలేని వాస్తవం. కళ్ళ ముందున్న చరిత్ర. 

యూపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా వాద్రా నడుం బిగించారు. అయితే ప్రియాంక ఆశిస్తున్న విధంగా యూపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవ స్థితి వస్తుందా అంటే ఇప్పటికిప్పుడు రాక పోవచ్చును, కానీ, ప్రయత్నించడంలో తప్పులేదు, నిజానికి అవసరం కూడా, అంటున్నారు రాజకీయ పరిశీలకులు. యూపీలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రియాంకా వాద్రా సారధ్యంలో ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీ నుంచి, ప్రతిజ్ఞా యాత్ర పేరిట 12000 కిలో మీటర్ల భారీ యాత్రకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోంది. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులు ప్రతి గ్రామాన్ని పలకరిస్తారు. ప్రతి ఇంటి తలుపు తడతారని, ఆ విధంగా యాత్రను రుపొందించామని కాంగ్రెస్ నాయకులూ చెపుతున్నారు. 

అలాగే గతంలో ఇతరేతర కారణాల వలన పార్టీని వదిలిపోయిన నాయకులు, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను కలిసి, తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ప్రియాంక సూచించారని, అవసరం అయితే తానే, స్వయంగా మాజీల ఇళ్ళకు వెళ్లేందుకు, వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఒక్క సారిగా అద్భుతాలు జరుగుతాయని కాదు కానీ, ప్రియాంక ఈరోజు వేస్తున్న అడుగు, రేపు యూపీలోనే కాదు దేశంలోనూ పార్టీకి పూర్వవైభవం తెచ్చే తొలి అడుగు కావచ్చును, రాజకీయాలలో ఏదీ అనూహ్యం కాదు, ఏదైనా జరగవచ్చును, కొయ్యాగుర్రం ఎగరావచ్చును..