గవర్నర్ ప్రసంగంపై మీడియాతో చంద్రబాబు

హైదరాబాద్: ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతిని శానససభలో గవర్నర్ నరసింహన్ గుడ్డిగా చదివారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రి, పిసిసి అధ్యక్షుడు తనవారికి 31 మద్యం దుకాణాలున్నాయని చెప్పినా కూడా గవర్నర్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన బొత్స సత్యనారాయణను ఉద్దేశించి అడిగారు. శాసనసభలో గవర్నర్ చేసిన ప్రసంగంపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పది లక్షల రూపాయలు ముడుపులు తీసుకుంటే కూడా గవర్నర్ చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. మెజారిటీ మంత్రులు కుంభకోణాల్లో ఇరుక్కుపోయారని ఆయన అన్నారు. భయంకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆయన అన్నారు. జలయజ్ఞంలోని అవినీతిని చెప్పలేకపోతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యల గురించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని కరవు గురించి కూడా గవర్నర్ మాట్లాడలేదని ఆయన అన్నారు. చంచల్‌గుడా జైలు, నాంపల్లి సిబిఐ కోర్టు, ఎసిబి దాడులు, రిమాండ్ రిపోర్టులు, రిమాండ్ రిపోర్టులో మంత్రి, అధికారుల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఐదు వేల కోట్ల రూపాయల ఆబ్కారీ ముడుపుల వ్యవహారం బయటకు వచ్చిందని ఆయన అన్నారు. అంబేడ్కర్ విగ్రహాలను కూలగొడుతుంటే ప్రభుత్వం నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఎక్కడా ప్రభుత్వం పని చేయడం లేదని ఆయన అన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు, ఇంత పెద్ద యెత్తున అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చిన సందర్భాలు మునుపెన్నడూ రాష్ట్రంలో లేవని ఆయన అన్నారు. ఉద్యోగాలను కూడా జాతరతో పోల్చే స్థితికి ప్రభుత్వం వచ్చిందని ఆయన అన్నారు. శాంతిభద్రతల గురించి ఒక్క మాట కూడా లేదని, మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ జాడ కూడా లేదని ఆయన అన్నారు.