తెలంగాణ తీర్మానంపై చేతులెత్తేసిన సీఎం
posted on Feb 13, 2012 2:06PM
హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం బిఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపించాల్సిందిగా సిఎంను కోరారు. అయితే సిఎం మాత్రం దీనిపై నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ అంశం మన పరిధిలో లేదని, కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. దీంతో తీర్మానం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టాల్సిందేనని టిఆర్ఎస్ పట్టుపట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెండుసార్లు ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేశారని, అది కూడా కేంద్రం పరిధిలోనే ఉన్నప్పుడు తీర్మానం ఎలా చేశారని వారు సిఎంను ప్రశ్నించారు. అయినప్పటికీ సిఎం మాత్రం తీర్మానంపై నిస్సహాయత వ్యక్తం చేశారు. కాగా సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి సభ్యులను కోరారు. కాగా బిఏసి సమావేశం అనంతరం టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ టిఆర్ఎస్ఎల్పీలో సమావేశమయ్యాయి. ఆ పార్టీలు సమావేశాలలో తెలంగాణపై ఉమ్మడిగా ముందుకు వెళ్లనున్నాయి.