లోపాలను జయించకపోతే!

ఒకానొక రాజ్యంలో ఓ గొప్ప శిల్పకారుడు ఉండేవాడు. శిల్పకారుడంటే అలాంటి ఇలాంటివాడు కాదు... సుదూరతీరాల వరకూ అతని పేరు మారుమోగిపోతూ ఉండేది. అతనితో శిల్పాలు చెక్కించుకునేందుకు దేశదేశాల రాజులు ఉబలాటపడేవారు. ఎందుకంటే అతను శిల్పం చెక్కితే అచ్చు మనిషే నిలబడినట్లు ఉండేది. అసలుకీ, నకలుకీ వెంట్రుకవాసిలో కూడా తేడా ఉండేది కాదు. అలాంటి శిల్పకారుడికి ఓ కొడుకు ఉండేవాడు. అతనూ తక్కువ వాడేమీ కాదు. చిన్నప్పటి నుంచీ తండ్రి దగ్గర శిల్పకళకు సంబంధించిన ప్రతి ఒక్క మెలకువా చకచకా నేర్చేసుకున్నాడు కొడుకు. తండ్రికి తగ్గ కొడుకనీ, తండ్రి తరువాత అతనే రాజ్యంలో గొప్ప శిల్పకారుడనీ అతనికి పేరు. కానీ అతనికి మాత్రం ఆ పేరు ఏమాత్రం తృప్తి కలిగించేంది కాదు. ఎందుకంటే...

 

కొడుకు ఎంత కష్టపడి ఒక శిల్పాన్ని చెక్కినా కూడా దానికి తండ్రి ‘బాగానే ఉంది కానీ...’ అంటూనే ఏవో ఒక సవరింపులు చెప్పేవాడు. కనుముక్కు తీరు కుదరలేదనో, గడ్డం ఇంకాస్త కోసుగా ఉండాలనో... ఇలా ఏదో ఒక సవరణ చెప్పేవాడు తండ్రి. తండ్రి వంక పెట్టిన ప్రతిసారీ, కొడుకు మరింత కసిగా శిల్పాలను చెక్కేవాడు. కానీ ఏం లాభం! కొడుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ‘బాగానే ఉంది కానీ...!’ అంటూ మరో లోపాన్ని ఎత్తి చూపేవాడు కొడుకు. ఒక పక్క సమాజంలో శిల్పకారునిగా కొడుకు ప్రతిష్ట పెరిగిపోతోంది. కానీ ఇంట్లో పరిస్థితి ఈగల మోతలా ఉంది. శిల్పకారుడైన తండ్రే మెచ్చుకోకపోతే ఇక తన ప్రతిభ ఎందుకు? అనుకుని మధనపడిపోయేవాడు కొడుకు. దాంతో అతను ఓ ఉపాయాన్ని ఆలోచించాడు.

 

తన తండ్రికి తెలియకుండా ఓ అందమైన శిల్పాన్ని చెక్కడం మొదలుపెట్టాడు కొడుకు. రోజుల తరబడి తన శక్తిసామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తూ ఒకో అంగుళమే చెక్కసాగాడు. తండ్రి ఆ వైపుగా వచ్చినప్పుడల్లా శిల్పం కనిపించకుండా దాన్ని ఒక గోతిలో ఉంచేవాడు. అలా దాదాపు మూడు మాసాలు కష్టపడి తన జీవితంలోకెల్లా ఓ అద్భుతమైన శిల్పాన్ని చెక్కాడు కొడుకు. ఒక రోజు తండ్రి పనిచేసుకునే సమయానికి ఏమీ ఎరగనట్లు ఆ శిల్పాన్ని తీసుకువెళ్లి ఆయన ముందర నిల్చొన్నాడు. ‘నాన్నగారూ నిన్న పట్నానికి వెళ్లినప్పుడు ఈ శిల్పాన్ని చూశాను. వెంటనే కొనేయాలన్నంతగా నచ్చింది. ఎలా ఉంది? నేను చెక్కిన శిల్పాలకంటే బాగుందా?’ అని అడిగాడు.

 

‘ఓహ్! శిల్పం చాలా అద్భుతంగా ఉంది. వంక పెట్టడానికి ఏమీ లేదు. మన రాజ్యంలో ఇంత గొప్పగా శిల్పాలు చెక్కేవారున్నారంటే నమ్మడం కష్టంగా ఉంది. ఆ శిల్పకారుడిని కలుసుకుని తీరాలి. నువ్వు కూడా ఇంత చక్కగా శిల్పాన్ని చెక్కడం నేర్చుకోవాలి’ అన్నాడు తండ్రి.

 

తండ్రి ఆ మాటలు అనగానే కొడుకు ఒక్కపెట్టున నవ్వుతూ ‘చూశావా! నా శిల్పాలు అద్భుతంగా ఉంటాయని నీ చేతే చెప్పించాను. ఇది నేను చెక్కిన శిల్పమే. నేను ఎంత గొప్పగా చెక్కినీ మీరు నా పనిని మెచ్చుకోవడం లేదని ఇలా అబద్ధమాడాను’ అన్నాడు. ఆ మాటలకు తండ్రి మొహం చిన్నబోయింది. కొడుకు మొహం మాత్రం తండ్రిని జయించిన సంతోషంతో వెలిగిపోతోంది. ఆ రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుకి తన తల్లీతండ్రి తన గురించే మాట్లాడుకోవడం వినిపించింది. ఆ రోజు జరిగిన సంఘటన గురించి వారు చర్చించుకోవడం విని కొడుకు తలుపు దగ్గరే నిలబడిపోయాడు. తన గురించి తండ్రి ఏం చెప్పబోతున్నాడో అని ఆసక్తిగా వింటూ ఉండిపోయాడు. ‘నా తరువాత అంత బాగా శిల్పాలను చెక్కగలిగినవాడు నా బిడ్డే అని నాకు తెలుసు. కానీ పరిణతికి పరిమితులు ఎక్కడుంటాయి. వాడు ఒకో శిల్పాన్ని చెక్కి నా దగ్గరకు తీసుకురాగానే, తండ్రిగా వాడి ప్రతిభకి మురిసిపోయేవాడిని. కానీ వాడు మరింత మెరుగుపడాలని ఆశించేవాడిని. అందుకే వెతికి వెతికి వాడి శిల్పాలలో లోపాలను ఎత్తి చూపించేవాడిని. నేను అలా లోపాన్ని చూపించినప్పుడల్లా వాడి మొహం వాడిపోయేది. అయితే మరుసటి శిల్పంలో ఆ తప్పు చేయకుండా జాగ్రత్తపడేవాడు. కానీ ఇక నుంచి అలా సాధ్యం కాదు! వాడి శిల్పం అద్భుతంగా ఉందని నా నోటే చెప్పించుకున్నాడు. కాబట్టి ఇక తన పనికి తిరుగులేదనే నిర్ణయానికి వచ్చేసి ఉంటాడు. శిల్పకళలో వాడి ఎదుగుదల ఇక్కడితో ఆగిపోతుంది’ అంటూ చెబుతున్నాడు తండ్రి.

 

తండ్రి మాటలు విన్న తరువాత కొడుకు మొహం చిన్నబోయింది. గురువుల నిరంతరం శిష్యలలో లోపాలను ఎందుకు వెతికి, వాటిని ఎత్తి చూపిస్తూ ఉంటారో అర్థమైంది. ఓ చేత ప్రతిభను పెంచుకుంటూ, మరో చేత లోపాలను అధిగమించుకుంటూ ఉంటేనే ఎదుగుదల సాధ్యమని బోధపడింది.

 

- నిర్జర.