ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగ్! హోంమంత్రి వ్యాఖ్యలపై రచ్చ 

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఓటింగ్ జరిగింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేయడంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలు కిక్కిరిసిపోయి కనిపించాయి. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి రికార్డు స్థాయిలో 74 శాతం పోలింగ్ జరిగింది. ఈ సీటు పరిధిలో సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 82 శాతం పోలింగ్ జరగగా.. వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యల్పంగా 65 శాతం పోలింగ్ జరిగింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్ఠానంలోనూ గతంలో కంటే భారీగా ఓటింగ్ పెరిగింది. ఈ స్థానంలో దాదాపు 60 శాతం పోలింగ్ జరిగింది. 

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నేను ఉదయం ఎనిమిది గంటలకే ఓటు వేశా, వాణీ దేవికే ఓటు వేశా అని  హోంశాఖ మంత్రి చెప్పడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మహమూద్ అలీ ఓటును క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 

రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన హోం శాఖకు మంత్రి మహమూద్అలీ కనీస ఇంగితం లేకుండా ఓటర్లని మభ్యపెట్టె ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ఒక ఐఏఎస్ అధికారిగా, రాజ్యంగ పరిరక్షకులు.  కానీ కేసీఆర్ కి కాదు అనే సంగతి గుర్తు చేసుకోవాలన్నారు శ్రవణ్. హోమ్ మంత్రి మహమూద్ అలీ ఓటు ఏం చేస్తారో చెప్పాలి. ఆయన ఓటుని రద్దు చేస్తారా ? లేదా ?  హోమ్ మంత్రిగా వున్న వ్యక్తే ఇలాంటి మాటలు మాట్లాడటం దుర్మార్గం. హోమ్ మంత్రి తీరే ఈ ఎన్నికల తీరుకు అద్దం పడుతోందని ఆయన దుయ్యబట్టారు. పోలింగ్ రోజున  కుడా విచ్చల విడిగా డబ్బులు పంచారని శ్రవణ్  ఆరోపించారు.కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల ఎన్నికల సంఘం అయ్యిందా ? అని శ్రవణ్ ప్రశ్నించారు.

హోం మంత్రి మహమూద్‌ అలీ పై ఎన్నికల అధికారులకు ఓయూ జేఏసీ ఫిర్యాదు చేసింది.  ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనలను హోం మంత్రి ఉల్లంఘించారని  ఓయూ జేఏసీ నేత జటంగి సురేష్ యాదవ్ ఫిర్యాదు చేశారు. గోప్యత పాటించే ఓటు హక్కును హోం మంత్రి మహమూద్ అలీ  బహిర్గతం చేసి  ఎమ్మెల్సీ ఎన్నికలలో నిబంధనలను ఉల్లంఘించారని చెప్పారప.  తన ఓటును ఎవరికి వేశాననే విషయాన్ని బహిర్గతం చేసిన హోం మంత్రి మహమూద్ పై విచారణ చేయాలని,హోం మంత్రి ఓటుని డిస్ క్వాలిఫై చేయాలని సురేష్ యాదవ్ తన ఫిర్యాదులో కోరారు.