తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతి.. టీటీడీ నిర్ణయం
posted on Dec 28, 2024 8:35AM
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు సార్లు వారి లేఖలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెజారిటీ సభ్యులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమించాలనడంతో టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. . తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడాన్ని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖండించారు. తిరుమల శ్రీవారి దర్శనంలో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని మంత్రి కొండా సురేఖ కూడా గళమెత్తారు.
దీంతో ఈ విషయాన్ని పున: పరిశీలించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. బోర్డులోని మెజారిటీ సభ్యుల అభిమతం మేరకు వారానికి రెండు సార్లు తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇహనో ఇప్పుడో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.