హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఫర్ సేల్?
posted on Mar 14, 2021 7:30PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ రగిలిపోతోంది. కార్మికుల ఆందోళనకు అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. అన్నింటిని అమ్మేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తామని కూడా ప్రకటించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దీంతో మళ్లీ కౌంటరిచ్చిన కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఒకరికి ఒకరు తోడు లేకపోతే.. అన్ని అమ్మేస్తారని చెప్పారు. ఇవాళ విశాఖ.. రేపు సింగరేణి.. తర్వాత ఏదైనా కావచ్చని కామెంట్ చేశారు,
ఇప్పుడు కేటీఆర్ చెప్పినట్లే జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తర్వాత కేంద్ర సర్కార్ టార్గెట్ ఎయిర్ పోర్టే కాబోతోంది. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను వేగంగా ప్రైవేటీకరించాలని యోచిస్తున్న మోడీ సర్కార్.. ఆ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఎండియా, బీఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తోపాటు మరెన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వాటాలు కలిగిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అందులోని వాటాలను విక్రయించడం ద్వారా రూ. 2.5 లక్షల కోట్లను సమీకరించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తొలి దశ ప్రైవేటీకరణలో భాగంగా లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల కాంట్రాక్ట్‌లను అదానీ గ్రూప్ ఇప్పటికే దక్కించుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం గుర్తించగా అందులో పైన పేర్కొన్న నాలుగు విమానాశ్రయాల్లోని ఏఏఐ వాటాలను అమ్మేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరికొన్ని రోజుల్లో ఈ నిర్ణయం కేబినెట్ ఆమోదం కోసం వెళ్లనుంది.
విమానాశ్రయాల అమ్మకం విషయంలో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు లాభాల్లో ఉన్న, అంతగా లాభాల్లో లేని విమానాశ్రయాలను కలిపి విక్రయించనున్నారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏఏఐ దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్‌నకు 74 శాతం వాటా ఉంది. మిగతా 26 శాతం వాటా ఏఏఐ సొంతం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపునకు 54 శాతం వాటా ఉండగా, ఏఏఐకి 26 శాతం, ఫ్రాపోర్ట్ ఏజీ అండ్ ఎరామన్ మలేసియాకు 10 శాతం వాటా ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉండగా, బెంగళూరులోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కొత్తగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే మౌలిక సదుపాయాల రంగంలోని ప్రభుత్వ ఆస్తులను విక్రయించడమే ముఖ్యమైన దారిగా కనిపిస్తోందని అన్నారు.