కరోనా వ్యాప్తిని జపాన్ ఎలా అడ్డుకుంటోంది?
posted on Mar 28, 2020 5:36PM
ప్రస్తుతం ప్రపంచంలో ఒకే ఒక చర్చ..కరోనా..చిన్నా, పెద్దా, బీద, ధనిక, రాజు, బంటు వంటి తేడా లేకుండా అందర్నీ చుట్టేస్తున్న మహమ్మారి. దీని బారిన పడకుండా ప్రయత్నం చెయ్యని మనిషి కానీ, దేశంకాని లేవు. ఇంత విపత్కర పరిస్తితుల్లో కూడా జపాన్ నిబ్బరంగా ఎలా ఉండగలుగుతోంది? జపాన్ లో ఉంటున్న ఒక భారతీయ విద్యార్ధి రాసిన అనుభవం చూద్దాం.
జనవరిలో చైనా నుంచి డైమండ్ ప్రిన్సెస్ అనే ఒక ఖరీదైన ఓడ జపాన్ కు వచ్చింది. ఆ ఓడతో బాటుగా కరోనా వైరస్ కూడా జపాన్ వచ్చింది. మామూలుగా అయితే ఇప్పుడు ఇటలీ మాదిరిగా జపాన్ కూడా నాలుగో స్టేజికి వెళ్లి ఉండాల్సింది.
అయితే వెళ్లలేదు సరికదా కరోనా వైరస్ వ్యాప్తి నిలిచిపోయింది. జపాన్ కు వైరస్ సోకగానే నా తల్లిదండ్రులు నన్ను కొన్ని నెలల పాటు ఇండియాకు రమ్మన్నారు. జపాన్ లో వైరస్ తగ్గినప్పుడు వెనక్కి వెళ్లవచ్చని అన్నారు. కానీ నేను రాలేదు. ఇప్పుడు జపాన్ లో లాక్ డౌన్ లేదు. జపాన్ లో మాత్రం నేటి వరకు అంతా మామూలుగానే ఉంది. రోజూ ఆఫీసులకు వెళ్తున్నాం. అన్ని నిత్యావసర సర్వీసులకూ వెళ్తున్నాం. ఏ రెస్టారెంట్లు, మాల్స్ మూతపడలేదు.
మెట్రో రైళ్లు, బుల్లెట్ రైళ్లు మామూలుగానే నడుస్తున్నాయి. జపాన్ లో ఇటలీ లాగా ముసలివాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. టోక్యోలో అత్యధిక సంఖ్యలో విదేశీయులు నివసిస్తున్నారు. పర్యాటక క్షేత్రాలను సందర్శించే విదేశీయులను ఇప్పటికీ రానిస్తూనే ఉన్నారు. కేవలం స్కూళ్లు, పబ్లిక్ ఈవెంట్లను మాత్రమే నిలిపివేశారు. భారత దేశం లాక్ డౌన్ ప్రకటించింది. భారత్ లాంటి జనసాంద్రత ఎక్కువ ఉన్న దేశానికి అంతకన్నా గత్యంతరం లేదు. లాక్ డౌన్ ప్రకటించడం కన్నా భారత్ లో మరేం చేయలేరు. అయితే టోక్యో ప్రపంచంలో అత్యంత ఎక్కువ జన సాంద్రత ఉన్న నగరం. మరి లాక్ డౌన్ చేయకుండానే కరోనా వ్యాప్తి చెందకుండా ఎలా ఉంది? జపాన్ ప్రజల అలవాట్లు బహుశ లాక్ డౌన్ చేసే అవసరాన్ని ఆ దేశానికి రానివ్వలేదు. కరోనా వైరస్ ను నిరోధించడానికి ఇప్పుడు సూచిస్తున్న నియమాలు జపాన్ ప్రజలకు చిన్నప్పటి నుండే నేర్పిస్తారు. బహుశ వైరస్ నిలిచిపోవడానికి అదే కారణం కావచ్చు. జపాన్ ప్రజలు బయటకు వచ్చినప్పుడు ప్రతి సారీ మాస్క్ ధరిస్తారు. సాధారణ రోజుల్లో కూడా జపాన్ ప్రజలు 60% వరకూ మాస్క్ లు వేసుకోవడం చూస్తూనే ఉంటాం. సాధారణంగా రిసెప్షనిస్ట్, గవర్నమెంట్ ఆఫీసర్లు, డాక్టర్లు, నర్సులు, స్టేషన్ మాస్టర్లు, ట్రెయినీ స్టాఫ్, పోలీస్ లాంటి ఏ పబ్లిక్ ప్లేస్ లలో ఉండే వారైనా పనిలో పనిగా రోజూ మాస్క్ ధరిస్తారు. శీతాకాలంలో పిల్లలకు రోజూ మాస్క్ వేస్తారు. వారికి జలుబు వచ్చినా వేరేవారికి రాకుండా. వేరే వారికి వచ్చినా వీరికి అంటుకోకుండా. జపాన్ లో డస్టు బిన్ లను విరివిగా, తప్పనిసరిగా వాడతారు. అన్ని ప్రదేశాలలో చెత్త కుండీలు ఉంటాయి. పరిశుభ్రత వారి సంస్కృతిలో భాగం. స్కూళ్లలో ఆల్ఫాబెట్ లు నేర్చుకునే ముందే ఎలా క్లీన్ గా ఉండాలి, పబ్లిక్ లో ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలను నేర్పిస్తారు. రోడ్లపై ఉమ్మివేయడం, చెత్త వేయడం ఉండదు. జపాన్ వారు ఎప్పుడూ కరచాలనం చేయరు. వంగి నమస్కరిస్తారు. జపాన్ లో చేతులు కడుక్కోవడం సంస్కృతిలో ఒక భాగం. బహిరంగ మరుగుదొడ్లు, కార్యాలయ ప్రవేశాలు, సాధారణంగా ప్రతి ప్రభుత్వ స్థలంలో సబ్బులు, శానిటైజర్లు ఉన్నాయి. శానిటైజర్లను ఉపయోగించడం అనేది సర్వసాధారణంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. పబ్లిక్ టాయిలెట్లలో మొహం శుభ్రం చేసుకున్న తర్వాత వారు సింక్ ను కూడా శుభ్రం చేస్తారు. వెనుక వచ్చేవారు ఇబ్బంది పడకుండా. బయటకు వెళ్లినప్పుడు తమ చేతులను అప్పుడప్పుడూ శుభ్రం చేసుకోవడానికి తడి టిష్యూ ప్యాకెట్లను తీసుకు వెళతారు. సాధారణంగా అందరితో సామాజిక దూరాన్ని మెయింటైన్ చేస్తారు. ఈ కారణంతో జపాన్ లో కరోనా వైరస్ వ్యాపించలేదు. అందుకే మనం జపాన్ నుంచి పరిశుభ్రత నేర్చుకోవాలి.
వీటిలో చాలా వరకూ మనకు మన పెద్దవాళ్ళు చెప్పిన విషయాలే కదా అనిపిస్తోందా..అవును. తెలిసిన, నేర్చున్న విషయాలే..కానీ మనమే ఆచరణలో మర్చిపోయాం. ఇది మనందరం ఒప్పుకోవాల్సిన నిజం. భారతీతను, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మర్చిపోయి, విస్మరించి విదేశీ సంస్కృతీ సంప్రదాయాలతో పాటు వైరస్ ను కూడా ఆహ్వానించాం. ఇప్పటికైనా మళ్ళీ మన సంప్రదాయాలను పాటిద్దాం. విదేశాల్లోని మంచి సంప్రదాయాలను అనుసరిద్దాం. కరోనాను తరిమేద్దాం.