హైకోర్టు విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరమా?

 

ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుని విభజించేందుకు తెలంగాణా ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు సంసిద్దత వ్యక్తం చేసాయి. ఉమ్మడి హైకోర్టులో ప్రస్తుతం 49మంది న్యాయమూర్తులు ఉండగా వారిని ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో పంచేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా వారిలో ఎవరు ఏ రాష్ట్ర హైకోర్టులో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే వివరాలు కూడా సేకరించారు.

 

ప్రస్తుతం ఉన్న హైకోర్టు హైదరాబాద్ లో ఉంది కనుక అది తెలంగాణా రాష్ట్రానికే చెందుతుందనే ఉద్దేశ్యంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేయాలని పేర్కొనబడింది. కనుక తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడం అంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. దానితో ఉమ్మడి హైకోర్టుని విడదీసి తెలంగాణా రాష్ట్రానికి కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేద్దామనే తెలంగాణా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

 

ఈ సమస్యను వేరే విధంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో, ఇంతకు ముందు తెలంగాణా హైకోర్టు కోసం కేటాయిద్ధామనుకొన్న భవనాన్ని ఆంధ్రా హైకోర్టుకోసం కేటాయించడానికి తెలంగాణా ప్రభుత్వం సంసిద్ధమయింది. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న మెలిక పెట్టింది. హైకోర్టు విభజనకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కానీ తుళ్ళూరు వద్ద నిర్మించబోయే రాజధాని కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే 30వేల ఎకరాల భూసేకరణ చేసి ఉన్నందున అక్కడ హైకోర్టు కోసం భవనం నిర్మించుకొన్నాక నేరుగా అక్కడికే తరలిపోవాలనుకొంటున్నట్లు తెలిపింది. అంటే తెలంగాణా ప్రభుత్వం ఇవ్వదలచుకొన్న భవనంలోకి మారేదిలేదని చెప్పకనే చెప్పినట్లయింది.

 

కనుక ఉమ్మడి హైకోర్టు నుండి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును విడదీస్తే తప్ప తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే అవకాశం కనబడటం లేదు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసుకొనేందుకు హైదరాబాద్ లో వేరే భవనం కేటాయించేందుకు సంసిద్ధంగా ఉంది. ఒకవేళ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అది కూడా ఇష్టం లేకపోతే, ప్రస్తుతం ఉన్న భవనంలోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేసుకొందామని తెలంగాణా రాష్ట్ర అడ్వకేట్ జనరల రామకృష్ణ రెడ్డి ప్రతిపాదించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆ మూడు ప్రతిపాదనలకు అంగీకరించలేదు.

 

రాష్ట్రాలు విడిపోయిన తరువాత నేడు కాకపోతే రేపయినా హైకోర్టులు కూడా విడివిడిగా ఏర్పాటుచేసుకోక తప్పదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు విభజనకు ఎందుకు అభ్యంతరం చెపుతోందో తెలియదు గానీ మళ్ళీ ఈ అంశంపై కూడా ఇరు రాష్ట్రాల మధ్య కొత్త తగాదా మొదలయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే రెండు రాష్ట్రప్రభుత్వాలు అనేక అంశాలతో కుస్తీపట్లు పడుతున్నాయి. అటువంటప్పుడు మళ్ళీ మరో కొత్త సమస్యని సృష్టించుకోవడం వలన ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య మరింత దూరం పెరుతుంది.