ఫార్ములా- ఇ రేస్ స్కాం.. బాబు జపం దేనికి కేటీఆర్?

ఫార్ములా -ఇ కార్ లో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆయన అరెస్టయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే  కేటీఆర్ కూడా తన అరెస్టు అనివార్యం అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అరెస్టు భయం లేదు, ఒక వేళ అరెస్టు చేస్తే జైల్లో యోగా చేసి మరింత ఫిట్ గా తయారౌతానంటూ చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా అరెస్టుకు కేటీఆర్ మానసికంగా రెడీ అయిపోయినట్లు కనిపిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

ఈ నేపథ్యంలోనే  ఇటీవల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ తన హయాంలో అంటే తాను మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ఇన్వెస్టర్లకు ఎలా ప్రధాన గమ్యంగా మారిదో వివరించారు. తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి చేసిన ప్రయత్రాలను, సాధించిన ఫలితాలను వివరించిన కేటీఆర్ పనిలో పనిగా ఫార్ములా - ఇ కార్ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. అలా ప్రస్తావించి ఊరుకోకుండా చంద్రబాబు హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా -1 రేస్ నిర్వహణ కోసం జరిగిన ప్రయత్నాలను ప్రస్తావించారు. తద్వారా  తాను చేసింది రైట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు.

చంద్రబాబు ప్రయత్నానికి తాను చేసింది కొనసాగింపు మాత్రమేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఫార్ములా -ఇ కార్  ను అడ్డుకోవడం ద్వారా రేవంత్ హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చారని ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు పేరు ప్రస్తావించడం ద్వారా రేవంత్ రెడ్డిని డిఫెన్స్ లో  పడేయాలన్నదే కేటీఆర్ ప్రయత్నంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

అదే సమయంలో కామన్ వెల్త్ క్రీడల నిర్వహణ సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను ప్రస్తావించారు. మొత్తం మీద కేటీఆర్ తనపై ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు పేరును వాడేసు కుంటు న్నారు. ఫార్ముల వన్ రేస్ ల కోసం చంద్రబాబు ప్రయత్నాలకు ఇప్పడు కేటీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలకూ ఏ మాత్రం సంబంధం లేదని, చంద్రబాబును అడ్డుపెట్టుకుని బయటపడడానికి ప్రయత్నించడం సరికాదనీ, ఫార్ములా -ఇ రేస్ కుంభకోణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.