డిల్లీలో గగనతలం నుండి ఉగ్రదాడులకి అవకాశం?
posted on Nov 28, 2015 1:36PM
.jpg)
ఐసిస్ ఉగ్రవాదులు భారత్ లో మెట్రో నగరాలపై లేదా ప్రముఖ పుణ్య క్షేత్రాలపై దాడులు చేయవచ్చని కొన్ని రోజుల క్రితం నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇప్పుడు డ్రోన్ వంటి ఎగిరే వస్తువులను ఉపయోగించి గగనతలం నుండి దేశ రాజధాని డిల్లీపై దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. డిల్లీలో రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి నివాసాలపై, సిబీఐ, సి.ఐ.ఎస్.ఎఫ్ బి.ఎస్.ఎఫ్. వంటి సంస్థల ప్రధాన కార్యాలయాలున్న సిజి.ఓ.కాంప్లెక్స్ పై, రాజ్ పద్, ఇండియా గేట్ వంటి ప్రదేశాలలో ఎక్కడయినా గగనతలం నుండి దాడులు చేయవచ్చని నిఘావర్గాలు హెచ్చరించినట్లు హోం శాఖ తెలియజేసింది. డిల్లీ గగనతలం ఎక్కడ ఇటువంటి ఎగిరే వస్తువులు కనబడినా వాటిని తక్షణమే నేల కూల్చివేయమని హోం శాఖ భద్రతాదళాలకు ఆదేశాలు జారీ చేసింది.
డ్రోన్ వంటి ఎగిరేవస్తువులు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటి ద్వారా నగరాలలో ఒకచోట నుండి మరొక చోటికి వస్తువులను డెలివరీ చేయడానికి చాలా సౌకర్యం ఏర్పడుతుందని అందరూ చాలా సంతోషించారు. కానీ ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజం ఇంకా ఉపయోగించుకోవడం మొదలుపెట్టకమునుపే, అది ఉగ్రవాదులు చేతులులలో చాలా భయంకరమయిన ఆయుధంగా మారిపోయింది. ఇంతకు ముందు ఉగ్రవాదులు తాము ప్రేలుళ్ళకు పాల్పడాలనుకొనే ప్రదేశానికి స్వయంగా వెళ్లి అక్కడ బాంబులు అమర్చి పేల్చవలసి వచ్చేది. కానీ ఈ డ్రోన్ పరికరాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వారు దానికి బాంబులు అమర్చి ఎక్కడో మారుమూల సురక్షితమయిన ప్రాంతంలో కూర్చొని రిమోట్ ద్వారా తాము కోరుకొన్న చోట బాంబులు జారవిడిచి ప్రేల్లుళ్ళు చేసే సామర్ధ్యం పొందగలిగారు.
ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. కనుక ఈ డ్రోన్ పరికరాలను దేశంలో వినియోగించకుండా నిషేధం విధించారు. కానీ ఆ నిషేధం ఉగ్రవాదులను వాటిని ఉపయోగించకుండా ఆపలేదు కనుక ఈ పరికరాలను, వాటి మూలాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం. ఇంతవరకు కేవలం నేల మీదనే నిఘా అవసరం అయ్యేది. కానీ ఇప్పుడు విశాలమయిన ఆకాశంలో కూడా నిఘా పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. కనుక ఈ డ్రోన్ పరికరాలకి తక్షణమే విరుగుడు కనిపెట్టక తప్పదు.