ఆశించకుండా చేసే మేలు ఎలా ఉంటుంది?

మునుపటి తరాల్లో వారం చేసుకుంటూ చదువుకున్న విద్యార్థులు ఎందరో వుండేవారు. చదువుకోవాలనే వారి అభిలాషా, చదువుకునే  వారిపై ఈ గృహస్థుల అభిమానమూ చూడముచ్చటగా వుండేవి. భారతదేశ అధ్యక్షపదవి అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటివాడే చిన్నతనంలో వారాలు చేసి చదువుకునేంత బీదరికం అనుభవించాడని ఆ తరం వారు చెప్పుకుంటారు. గుణవంతులు, ప్రతిభావంతులు అయిన మరెందరో ఆ విధంగా కష్టపడి చదివి ఆ తర్వాతి జీవితంలో ఎంతగానో గొప్పగా ఎదిగిన వారున్నారు. తనతో సహపంక్తి భోజనం చేసిన కుర్రాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత ఏదో ఒక ఉన్నతస్థానం ఆక్రమించినప్పుడు తానే స్వయంగా అతడి సహాయం కొరకై ఎదురుచూచే సందర్భం రాకపోయినా, అతడు ఆనాడు తనకు భోజనసదుపాయం ఏర్పరిచిన గృహయజమానిని కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకున్నాడని ఎవరైనా చెప్పినప్పుడో, ఏదైనా సందర్భం పురస్కరించుకొని ఆ పెద్దమనిషి ఈ గృహస్థును ప్రత్యక్షంగా సత్కరించినప్పుడో ఇతడి ఆనందానికి అంతు ఉండదు.

దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి.. అమెరికాలోని లీలాండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున విద్యార్థులు అనుకోని ఆర్థిక ఇబ్బందులకు గురైనారు. ప్రఖ్యాత సంగీతజ్ఞుడు సాడీరుస్కీచేత పియానో వాద్యకచేరీ పెట్టించి ఇంత డబ్బు వసూలు చేయగలిగితే తమ ఇబ్బందినుండి బయట పడచ్చుకదా అని ఒక విద్యార్థికి తట్టింది. సాడిరుస్కీ కచేరీల ఏర్పాట్లు చూసే మానేజర్ను వెళ్ళి కలిశారు. పియానో కచేరీకి రెండువేల డాలర్లు ముట్టచెప్పవలసి వుంటుందన్నాడు ఆ మానేజర్, విద్యార్థులు అలాగేనంటూ వసూళ్ళు ప్రారంభించారు.

ఇద్దరు విద్యార్థులూ ఎంతో ప్రయత్నించారు కానీ, పదహారు వందల డాలర్లకన్నా వసూలు చేయలేక పోయారు. కచేరీ జయప్రదంగా ముగిసిన తర్వాత, వారిద్దరూ సాడిరుస్కీవద్దకు వెళ్ళి తాము చేసిన ప్రయత్నం అంతా వివరించి ఎంత శ్రమించినప్పటికీ చివరకు పదహారు వందల డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగామని చెప్పుకుంటూ, ఆ పదహారు వందల డాలర్లతో బాటు మరో నాలుగువందల డాలర్లకు ఓ ప్రామిసరీ నోటు వ్రాసి సాడిరుస్కీ చేతిలో ఉంచారు. 

వారు చెప్పినదంతా వినిన సాడిరుస్కీ "అలా కుదరదు బాబూ" అంటూ ఆ ప్రామిసరీ నోటును చింపేసి, పదహారు వందల డాలర్లు వారికి తిరిగి ఇస్తూ “ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి మీ కెంత ఖర్చయిందో అది ముందు తీసేసుకోండి. ఆ మిగిలిన మొత్తంలో చెరి పదిశాతం వంతున మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలంగా వుంచేసుకోండి. ఆ మిగతాది నాకివ్వండి" అంటూ అంత మాత్రమే తీసుకున్నాడు.

కాలచక్రం దొర్లింది. ప్రథమ ప్రపంచ సంగ్రామం ప్రారంభమై అనేక దేశాల ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసి అంతమైంది. సాడిరుస్కీ మాతృదేశం పోలండ్ ఆర్థికంగా చితికిపోయింది. ఆ దేశ ప్రజలకు తినడానికి తిండికూడా కరువైన గడ్డురోజులు వచ్చాయి. ఆవేశపూరితుడైన సాడిరుస్కీ తన దేశీయుల్ని గట్టెక్కించడానికి అహర్నిశలూ తన శాయశక్తులా కృషిచేస్తున్నాడు. ఆ విపత్సమయంలో తన మాతృదేశాన్ని ఆదుకోగలిగినవాడు అమెరికా దేశ ప్రెసిడెంట్ ఒక్కడేనన్న సంగతి సాడిరుస్కీ గ్రహించాడు. 

“మాకీతరుణంలో సహాయం చేసి పుణ్యం కట్టుకోండి”. అని సాడిరుస్కీ తన దేశం తరపున అమెరికన్ అధ్యక్షుడికి విజ్ఞప్తి పంపించీ పంపించక ముందే, పోలీష్ ప్రజలకు పంపిణీ చేయడానికిగాను వేలాది టన్నుల ఆహారధాన్యాలు పోలండ్ లోని ఆహారమంత్రికి అందడం ప్రారంభమైంది. క్షుధార్తులైన వారి ఆహారావసరాలు తీర్చి మరుక్షణం పారిస్ పట్టణంలో మకాం వేసుకున్న అమెరికన్ ప్రెసిడెంట్ హార్బర్ట్ హోవర్ను కలుసుకోడానికి అక్కడికి హుటాహుటిన వెళ్ళిన సాడిరుస్కీ "సకాలంలో సహాయం అందించి మా దేశవాసుల్ని రక్షించినందుకు కృతజ్ఞత తెలుపుకోడానికి వచ్చాను" అన్నాడు.

“దానిదేముంది లెండి సాడిరుస్కీ మహాశయా, మీ ప్రజల అవసరం ఎలాంటిదో నాకు అవగతమైంది. అదీకాక చాలా ఏళ్ళ క్రితం నేను చదువుకుంటున్న రోజుల్లో ఒకమారు చాలా ఆర్థిక ఇబ్బందులకు లోనైనాను. అప్పుడు మీరు నాకూ, నా స్నేహితుడికీ చాలా ఉదారంగా సహాయపడ్డారు లెండి" అని చిరునవ్వుతో సాడిరుస్కీ చేతులు పట్టుకున్నాడు హార్బర్ట్ హోవర్.

ఆశించకుండా చేసే సహాయం వల్ల తిరిగి మనిషికి దక్కే ఫలితాలు ఇలాగే ఎంతో అద్బుతంగానూ, ప్రయోజనం చేకూర్చేవి గానూ ఉంటాయి. 

                                       ◆నిశ్శబ్ద.

Related Segment News