మనిషిలో మరొక అంతర కోణం!
posted on Jun 19, 2023 9:30AM
హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు.
పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది. సాధారణంగా అయితే తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ.
మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది.
మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.
పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన.
కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు.
కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం
◆నిశ్శబ్ద.