పితాని తనయుడికి హైకోర్టులో చుక్కెదురు

ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

ఈఎ‌స్‌ఐ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వెంకట సురేష్‌, మాజీ కార్యదర్శి మురళీమోహన్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పిటిషనర్ల తరపున న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదిస్తూ.. రాజకీయ కక్షతోనే వీరిని ఈ కేసులో ఇరికించారని వాదించారు. వెంకట సురేష్ ఏనాడూ తన తండ్రి పదవిని దుర్వినియోగం చేయలేదని అన్నారు. అలాగే, పితాని వద్ద కార్యదర్శిగా ఉన్న మురళీమోహన్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొన్నారు. కావున ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. అజయ్ కుమార్ వాదనతో ఏసీబీ తరఫు న్యాయవాది విభేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను తిరస్కరించారు.