ఈటలకు చెక్ పెట్టేందుకు హరీష్! కేసీఆర్ అస్త్రమా.. అనుమానమా? 

తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ కాక రేపుతోంది. తన భవిష్యత్ కార్యాచరణ కోసం ఈటల రాజేందర్ వరుస సమావేశాలు నిర్వహిస్తుండగా... ఆయనకు కౌంటర్ గా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. టీఆర్ఎస్ అనుకూల, ఈటల వర్గీయుల పోటాపోటీ సమావేశాలతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం రంజుగా మారుతోంది. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. అతనికి మరింత చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. ఈటలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి మద్దతు లభిస్తుండటంతో.. గులాబీ బాస్ పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నారని చెబుతున్నారు. ఈటల రాజీనామా చేస్తే జరగబోయే హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారని టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

ఈటలను రాజకీయం కోలుకోలేని దెబ్బ తీయాలని భావిస్తున్న కేసీఆర్... హుజురాబాద్ లో  ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారట. అందుకే హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించారని సమాచారం. మొదటి నుంచి హరీష్ తో ఈటలకు మంచి సంబంధాలున్నాయి. దీంతో హరీష్ నే రాజేందర్ పై ప్రయోగిస్తున్నారని అంటున్నారు. మంగళవారం హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఈటల కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జీగా నా మిత్రునికే బాధ్యతలు అప్పగించారని తెలిసింది అని ఈటల అన్నారు. ఈటల చెప్పిన  ఆయన మిత్రుడు హరీష్ రావేననే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం రెండు రోజుల క్రితం హుజురాబాద్ నియోజకవర్గంలో వివిధ మండలాలకు ఇంఛార్జీలను నియమించింది. నియోజకవర్గ పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పార్టీకి అనుకూలంగా కేడర్‌ను ఉంచే బాధ్యతలను జిల్లా మంత్రిగా గంగుల కమలాకర్‌కు అప్పగించింది. ఓవరాల్ గా నియోజకవర్గ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారని తెలుస్తోంది. 

కేసీఆర్ ఆదేశాలతో హరీష్ రావు రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళపల్లి రాజేశ్వర్ రావు, జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, పిఏసిఎస్ చైర్మన్ పోనగంటి సంపత్, పలువురు సర్పంచ్ లు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు ను కలిశారు. తాము టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటించారు. ఉద్యమ కాలం నుంచి గులాబీ జెండా కిందే ఉన్నామని, ఇకపై కూడా అలాగే ఉంటామని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా హైడ్రామా నడుస్తోంది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఒక రోజు ఈటలకు మద్దతు తెలుపుతూ మరోరోజు టీఆర్ఎస్ కు మద్దతుగా ఉంటున్నారు. దీంతో ఎవరూ ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ లోనే మకాం వేశారు రాజేందర్. దీంతో అప్రమత్తమైన కేసీఆర్.. హరీష్ ను పురమాయించారని అంటున్నారు. కేసీఆర్ ఆదేశాలతో హరీష్ రావు... నేరుగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే జమ్మికుంట గులాబీ లీడర్లు సిద్ధిపేటకు వెళ్లి హరీష్ రావుతో సమావేశమయ్యారు. 

ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగించిన వెంటనే హరీష్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఈటల, హరీష్ ఇద్దరిపై గులాబీ బాస్ కోపంగా ఉన్నారని, తర్వాత వేటు హరీష్ రావుపైననే చర్చ జరిగింది. కాని టీఆర్ఎస్ లో మాత్రం పరిస్థితి మారిపోయింది. హరీష్ రావుకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత పెరిగింది. వైద్యశాఖ ప్రస్తుతం కేసీఆర్ దగ్గరే ఉండగా.. ఆ బాధ్యతలను హరీష్ రావుకు ఆయన అప్పగించారు. కేంద్రంతో జరిగే సమీక్షల్లో సీఎం తరపున హరీష్ రావే పాల్గొంటున్నారు. తాజా పరిణామాలతో హరీష్ రావు మళ్లీ యాక్టివ్ అయినట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  ఈటల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు హరీష్ రావునే గులాబీ బాస్ రంగంలోకి దింపుతున్నారని అంటున్నారు.

మరోవైపు తన మిత్రుడినే తనకు పోటీగా దింపారంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈటల వ్యాఖ్యలతో హరీష్ రావుకు కొంత ఇబ్బంది తప్పదని చెబుతున్నారు. ఈటలకు తాను సన్నిహితం కాదని నిరూపించుకోవల్సిన ఆవశ్యకత హరీష్ రావుకు ఏర్పడిందంటున్నారు. హుజురాబాద్ లో ఏ మాత్రం తేడా వచ్చిన ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ తప్పవు. ఈ రకంగా హరీష్ రావుకు కేసీఆర్ పరీక్ష పెట్టారనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది .