జర్నలిస్ట్ భూములపై కెసీఆర్ కుట్ర ఆగలేదా?
posted on Sep 18, 2024 2:56PM
జర్నలిస్ట్ లకు రేవంత్ సర్కారు తాము మార్కెట్ ధరకు కొనుగోలు చేసిన భూమి అప్పగించినప్పటికీ బిఆర్ఎస్ కుట్రలు ఇంకా ఆగలేదు. కూతురు కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న సమయంలో కూడా తెలంగాణ కార్డు ఉపయోగించిన బిఆర్ఎస్ తన అవసరానికి తెలంగాణ పేరు ఎత్తుకుంటుంది. బిఆర్ ఎస్ తన పేగు బంధాన్ని వెతుక్కుంటుంది. తల్లి వేరు కోసం తండ్లాడుతోంది. తన మూలాలను కనుగొనే పనిలో పడింది. అయితే ఫ్రస్టేషన్ లో ప్రాంతీయవాదాన్ని ఎత్తుకోవడం ఆ పార్టీ సిద్దాంతంగా మారిపోయింది. రెండు దశాబ్దాల జర్నలిస్ట్ కల నెరవేరే వేళ బిఆర్ఎస్ మరో కుట్రకు తెరలేపింది. సోషల్ మీడియాద్వారా జర్నలిస్టులపై విషాన్ని చిమ్ముతోంది.3, 600 కోట్ల భూమిని ఆంధ్రా జర్నలిస్ట్లకు రేవంత్ రెడ్డి కట్టబెట్టటారని ప్రచారం చేస్తోంది. ఇటీవల సచివాలయంలో రాజీవ్ విగ్రహావిష్కరణ సమయంలో కూడా తెలంగాణ తల్లి ప్రస్థావన బిఆర్ఎస్ తెచ్చింది. అంతకుముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి పిఎసి చైర్మన్ పదవి రావడాన్ని బిఆర్ఎస్ తట్టుకోలేకపోయింది. అరికెపూడి రేవంత్ రెడ్డికి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇంతటితో ఆగకుండా మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరికెపూడిపై ఉసిగొల్పింది. కెసీఆర్ తన ఫాం హౌజ్ కు పిలిపించుకుని కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టినట్లు సమాచారం. అరికెపూడి ఆంధ్రోడు అంటూ కౌశిక్ రెడ్డి దుర్బాషలాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగుతుండగానే తన ఇంటికి రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో అరికెపూడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. ఈ గొడవ కాస్తా అరికెపూడిపై హత్యాయత్నం కేసుగా టర్న్ అయింది. కెసీఆర్ కు అప్నా పరాయ్ ఉండదు.తనకు వ్యతిరేక గళం వినిపిస్తే హిట్లర్ లా మారిపోతాడు. స్వంత పార్టీ ఎమ్మెల్యేనే హత్యాయత్నం కేసులో ఇరికించిన ఘనాపాటి. జర్నలిస్ట్ ల సపోర్ట్ తో అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ పదేళ్లు అధికారంలో కొనసాగింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్ట్ లు కొనుగోలు చేసిన 70 ఎకరాల భూమి న్యాయ వివాదాల్లో ఇరుక్కొంది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం కేవలం నిజాంపేటలోని 32 ఎకరాలను అప్పగించిన కెసీఆర్ పేట్ బషీర్ బాద్ లోని 38 ఎకరాలను అప్పగించలేదు. విలువైన ఈ భూమిపై కెసిఆర్ కన్ను పడింది. ఇంకేం తన కుట్రకు శ్రీకారం చుట్టాడు. మాజీ జర్నలిస్ట్ క్రాంతికిరణ్ కు ఆందోల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జర్నలిస్ట్ లంటే తనకు అభిమానమని చెప్పుకున్నాడు . ఈయనను జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ ప్రెసిడెంట్ పదవిలో కూర్చోబెట్టే విధంగా పావులు కదిపాడు. మరో మాజీ జర్నలిస్ట్ పల్లె రవిని బిఆర్ఎస్ లో చేర్చుకున్నాడు ఎలాంటి ఎన్నికలు లేకుండానే క్రాంతికిరణ్ , పల్లె రవి లను సొసైటీ డైరెక్టర్లు చేసి 38 ఎకరాలను మింగేయాలని చూశాడు. అప్పటి అధికార పార్టీ చెప్పినట్లు చేసింది పాత కమిటీ. బిఆర్ఎస్ అరాచకాలను టీం జెఎన్ జె ఎప్పటికప్పుడు ప్రశ్నించి ఉద్యమాలు చేసింది. ప్రతిపక్షాల మద్దత్తును కూడగట్టుకుంది. అప్పటిపిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని కల్సింది. ఈ భూములను తిరిగి జర్నలిస్ట్ లకు అప్పగిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో లో చేర్పించిన ఘనత టీం జెఎన్ జె దే. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. పదేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉన్నహౌజింగ్ సొసైటీకి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగి ఇద్దరు టీం జెఎన్ జె సభ్యులు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. రమణారావు, అశోక్ రెడ్డి డైరెక్టర్లుగా ఎన్నికైన తర్వాతే 38 ఎకరాల భూమి ఫైల్ వేగంగా కదిలింది. ఎట్టకేలకు కెసీఆర్ అప్పగించని భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించింది.
సుప్రీం తుదితీర్పు ప్రకారం పేట్ బషీర్ బాద్ భూమిని రేవంత్ సర్కారు అప్పగించింది. ఇక్కడే కెసీఆర్ కు కడుపు మండిపోయింది. మరో కుట్రకు తెరలేపాడు. బిఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ లో ఉన్న నల్లబాలు అనే బిఆర్ఎస్ కార్యకర్తను రెచ్చగొట్టి తెలంగాణ కార్డును మరో మారు ప్రయోగించాడు. హౌసింగ్ సొసైటీకి ఇటీవల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ స్థలాన్ని అప్పగించడంపై కొందరు కుట్రదారులు కడుపుమంటతో అక్కసు వెళ్లగక్కుతున్నారని సొసైటీ డైరెక్టర్లు బి.కిరణ్ కుమార్, ఆర్.రవికాంత్‌రెడ్డి, ఎన్.వంశీ శ్రీనివాస్, పీవీ రమణారావు, కె.అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. స్థలాల కేటాయింపును అడ్డుకుంటామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. అప్పట్లో స్థలం కొనుగోలుకు సభ్యులు అందిన కాడల్లా అప్పు చేశారని, ఇంకొందరు అప్పు పుట్టక భార్యల మంగళసూత్రాలు తాకట్టు పెట్టారని వారు వివరించారు. కుట్రదారులు వాస్తవాలను దురుద్దేశపూరితంగా విస్మరించి సొసైటీపై విషం చిమ్ముతున్నారని, ఆంధ్ర, తెలంగాణ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.