జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

దేశంలో కేంద్రానికి, రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి (జమిలి) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  వన్ నేషన్ -వన్ ఎలక్షన్‌పై నియమించిన రామ్నాథ్ గోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశం మీద పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెడతారు.  జమిలి ఎన్నికల నిర్వహణకు మోడీ ప్రభుత్వం పట్టుదలగా వుంది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ తదితర ప్రతిపక్షాలు అంటున్నప్పటికీ ఈ విషయంలో మోడీ సర్కార్ వెనుక అడుగు వేసే ఉద్దేశాన్ని ఏ దశలోనూ వ్యక్తం చేయలేదు. రెండు రోజుల క్రితం హోం శాఖ మంత్రి అమిత్ షా ఈసారి జమిలి ఎన్నికల నిర్వహణకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని స్పష్టంగా చెప్పారు. 

పదేళ్ల క్రితం బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తూనే ఉంది. గత రెండు పర్యాయాలుసంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ ఈసారి సంకీర్ణ భాగస్వాముల మద్దతుపై ఆధారపడి సర్కార్‌ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జమిలి ఎన్నికలపై ఎంతమాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం. మొన్నటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా ఎర్రకోటపై నుంచి ప్రధాని ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి స్పష్టంగా చెప్పారు కూడా.

దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా మారింది. దేశంలో ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు నిర్వహిస్తూనే వుంటారు. ఇలా ఎన్నికల ప్రక్రియ నిరంతరం జరగడం వల్ల దాని ప్రభావం దేశ  అభివృద్ధి మీద పడుతోందన్న అభిప్రాయాలున్నాయి. దీన్ని అధిగమించడానికి జమిలి ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. జమిలి ఎన్నికల వల్ల ఎలక్షన్ల నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, అలాగే, రాష్ట్రాల్లో నిరంతరం ఎన్నికలు జరుగుతూ వుండటం వల్ల ఎలక్షన్ కోడ్ కారణంతో సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ పడుతోందని, జమిలి వల్ల అలాంటి ఇబ్బందులు వుండవని అంటున్నారు.  ప్రధాని తదితర బీజేపీ నాయకులు జమిలి ఎన్నికల విషయలో చాలా ఉత్సాహంగా వున్నారు. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ కూడా జమిలి ఎన్నికలకు తన ఆమోదం తెలిపింది. కానీ, ఆచరణలో ఎంతవరకు సాధ్యమన్నది ఒక చిక్కు ప్రశ్న. 

జమిలి ఎన్నికల విషయంలో అంతరార్థ విశ్లేషణ