సుధారాణి బాటలో మరో రాజ్యసభ ఎంపీ?
posted on Oct 30, 2015 7:32PM
టీడీపీకి రాజ్యసభ పదవులు అచ్చిరావడం లేదు, ఎంతోమంది అసంతృప్తుల్ని బుజ్జగించి ఏరికోరి రాజ్యసభకు పంపిస్తే... పదవీకాలం ముగిసేముందు హ్యాండిస్తున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దగ్గర్నుంచి ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వరకూ ఇదే రిపీట్ అవుతోంది, ఇప్పటివరకూ కనీసం 15మంది రాజ్యసభ సభ్యులు టీడీపీ గడప దాటినట్లు అంచనా, నాడు రేణుకాచౌదరి దగ్గర్నుంచి నేడు గుండు సుధారాణి వరకూ అందరికీ అదే బాట, వీళ్లలో పార్టీ మారిన వారు కొందరైతే... పార్టీకి దూరంగా ఉంటున్నవాళ్లు మరికొందరు, టీడీపీ రాజ్యసభకు పంపినవాళ్లలో కొందరు మొత్తం రాజకీయాల్నే వదిలేసినవాళ్లున్నారు.
టీడీపీ రాజ్యసభకు పంపిస్తే వాళ్లు పార్టీలో ఉండరన్న సెంటిమెంట్ ప్రతీసారీ రిపీట్ అవుతోంది, రేణుకాచౌదరి, సి.రామచంద్రయ్య, మోహన్ బాబు, జయప్రద, మైసూరారెడ్డి, వంగా గీత, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, రామచంద్రారెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య... ఇలా ఓ పదిహేను మంది రాజ్యసభ పదవీకాలం ముగిసే ముందు పార్టీకి దూరమైనవాళ్లే. అంతేకాదు ఇప్పటివరకూ టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లినవారితో లాభం కంటే పార్టీకి నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పాలి, సి.రామచంద్రయ్యను రెండుసార్లు రాజ్యసభకు పంపిస్తే... మూడోసారి అవకాశం ఇవ్వలేదంటూ తెలుగుదేశానికి గుడ్ బై చెప్పేశారు, ఇప్పుడు అదేరీతిలో కార్పొరేటర్ స్థాయి లీడర్ సుధారాణిని రాజ్యసభకు పంపిస్తే... పార్టీకి హ్యాండివ్వబోతోంది.
గుండు సుధారాణి బాటలోనే మరో టీడీపీ రాజ్యసభ ఎంపీ పార్టీ మారతారనే టాక్ వినిపిస్తోంది, 2014 సాధారణ ఎన్నికల్లో రాయలసీమ బాధ్యతలను చూసిన ఆ నాయకుడ్ని ఇప్పుడు చంద్రబాబు పక్కనబెట్టారని, దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. 2014 ఎన్నికల వరకూ బాబు కోటరీలో కీలక వ్యక్తిగా ఉన్న ఆ నాయకుడు... ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి, టీడీపీ విజయం కోసం తాను తీవ్రంగా కష్టపడితే... తీరా అధికారంలోకి వచ్చాక పక్కనబెడతారా అంటూ రగిలిపోతున్న ఆ సీమ నాయకుడు... వైసీపీలో చేరతారనే టాక్ కూడా వినిపిస్తోంది.