గవర్నర్ తరువాత కేటీఆర్ డిల్లీ పయనం దేనికి?

 

గవర్నర్ నరసింహన్ నిన్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి యల్.సి.గోయల్ తదితరులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న పరిస్థితులు, తదనంతర పరిణామాలపై లోతుగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కానీ వారు ఈ సమావేశంలో ఏమేమి నిర్ణయాలు తీసుకొన్నారనే విషయం బయటకి పొక్కనీయలేదు. కనుక పరిస్థితులను చక్కదిద్దవలసిన బాధ్యత గవర్నర్ దే నని హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ చెప్పినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ గవర్నర్ నరసింహన్ కి ఆయన బాధ్యతల గురించి కేంద్రం కొత్తగా గుర్తు చేయనవసరంలేదని అందరికీ తెలుసు. అదే మాట చెప్పదలిస్తే ఆయనని అంత అత్యవసరంగా డిల్లీకి పిలిపించనవసరం లేదు. ఆ ముక్కేదో ఆయనకు ఫోన్లోనే చెప్పవచ్చును. కనుక వారి సమావేశంలో అంతకంటే ముఖ్యమయిన నిర్ణయాలే తీసుకొని ఉండవచ్చని భావించవచ్చును.

 

ఆయన హైదరాబాద్ తిరిగి రాగానే నేడు మళ్ళీ తెలంగాణా ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు డిల్లీ బయలుదేరబోతున్నారు. ఆయనతోపాటు తెలంగాణా ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు కూడా డిల్లీ వెళ్లి ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశం కానున్నారు. వారు డిల్లీ వెళ్ళడానికి వేరే ఇతర కారణాలు చెప్పవచ్చును. హోంమంత్రికి బదులు ఆర్ధికమంత్రిని కలవవచ్చును. కానీ నిన్న గవర్నర్, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ ల మధ్య జరిగిన కీలక సమావేశంలో ఇరురాష్ట్రాల మధ్య తలెత్తిన సంక్షోభం నివారణకు తీసుకొన్న నిర్ణయాలను అమలు చేసే ప్రక్రియలో భాగంగానే వారిని డిల్లీకి పిలిపించి ఉండవచ్చును.

 

ఇదివరకు కూడా మంత్రి కేటీఆర్ డిల్లీ వెళ్ళివచ్చిన తరువాత ఓటుకి నోటు కేసులో ఎసిబి జోరు కొంచెం తగ్గిన సంగతి గమనిస్తే అది అర్ధమవుతుంది. ఈ కేసు విషయంలో తెలంగాణా ప్రభుత్వం బహుశః గవర్నర్ మాటను వినేట్లులేదు కనుకనే కేంద్ర ప్రభుత్వం కేటీఆర్ తో మాట్లాడేందుకు డిల్లీకి పిలిపించి ఉండవచ్చును. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రతినిధిగా భావింపబడే ఆయన కుమారుడు కేటీఆర్ తో కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే, గవర్నర్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నాలు చేయవచ్చును. రానున్న రెండు మూడు రోజుల్లో ఉభయ రాష్ట్రాలలో జరుగబోయే పరిణామాలను బట్టి డిల్లీలో ఏమి జరిగిందనే విషయంపై కొంత స్పష్టత వస్తుంది.