గెజిటెడ్ అధికారి ఉద్యోగాలిచ్చినా చేరలేదు
posted on Oct 16, 2012 1:27PM
ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఉద్యోగం దొరకాలంటే పైసలు పెట్టాల్సిందే ఈ మాటలు మనం రోజు వినేవే. దీనికి పూర్తి భిన్నంగా పిలిచి గెజిటెడ్ అధికారి ఉద్యోగాలిస్తే అక్షరాల 135 మంది ఉద్యోగం వద్దని, అసలు ఆ ఉద్యోగంలో చేరడానికే రాలేదు. రాష్ట్రంలోమండల వ్యవసాయ అధికారి నియామక పత్రాలు పంపితే మొత్తం 135 మంది చేరకపోవడంతో వ్యవసాయశాఖ బిత్తరపోయింది. వారి కోసం రెండు నెలలు ఎదురుచూసి ఇక మళ్ళీ నియామకాలు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధంచేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంకా 200 ఏఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడు నెలల క్రితం 474 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. వాటిలో సాంకేతిక కారణాల వల్ల 12 పోస్టులు ని౦పడం సాధ్యం కాక పక్కన పెట్టారు. మిగతా 462 పోస్టులకు అర్హుల నుంచి 327 దరఖాస్తులు రావడంతో వారికి నియామక పత్రాలను వ్యవసాయ కమిషనర్ కార్యాలయం పంపింది. ఉద్యోగంలో చేరడానికి నెల రోజులు గడువు ఇస్తే 135 మంది రెండు నెలలైనా రాలేదు. వీటి భర్తీకి అనుమతించాలంటు మళ్ళీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడానికి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం సిద్ధమవుతుంది.