రోజాపై గాలి వ్యాఖ్యలు.. కేసీఆర్ కు నచ్చలేదట..
posted on Jul 4, 2017 12:03PM
.jpg)
వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్ రోజా టీడీపీపై విమర్శలు గుప్పించడంలో ఎప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. మైకు ముందు రెచ్చిపోయి మరీ టీడీపీ పై విమర్శలు గుప్పిస్తుంటారు. ఇక రోజా విమర్శలకు ధీటుగా టీడీపీ నేతలు కూడా విమర్శలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల టీడీపీ సీనీయర్ నేత ముద్దుకృష్ణమ నాయుడు ఆమెపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇప్పుడు గాలి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించినట్టు సమాచారం. కేసీఆర్ సమక్షంలో జరిగిన సమావేశంలో అనుకోకుండా ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందట. ఇక దీనిపై స్పందించిన కేసీఆర్.. "ముద్దు కృష్ణమ నాయుడు తమ కన్నా సీనియర్ నేత. తాము అసెంబ్లీలో అడుగుపెట్టిన కొత్తలోనే ఆయన వద్ద కొన్ని పాఠాలు నేర్చుకున్న సందర్భాలున్నాయి అని అన్నారట కేసీఆర్. అటువంటి నాయకుడు ఇవాళ ఈ విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే అయిన రోజా గురించి అలా మాట్లాడటం కరెక్టుగా అనిపించడంలేదు. ముద్దన్న చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన స్థాయికి తగినవి కాదు. అందుకే మనం ఇలా చర్చించుకున్న విషయం ఎలాగోలా ముద్దన్నకు అర్థమయ్యేలా చెప్పండి" అని సూచించారట కేసీఆర్.
దీంతో ఈ పనిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తనపై వేసుకోని గాలి ముద్దుకృష్ణమ నాయుడికి ఫోన్ చేసి మీ స్థాయి తగ్గించుకోవద్దని మా సీఎం చెప్పమన్నారని ఆయన సూచించారని తెలిపారట. దీనికి గాను గాలి ధన్యవాదాలు తెలుపుతూనే - రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతూనే ఉండాలని, లేకపోతే ప్రత్యర్థులు చెప్పేవే ప్రజల్లోకి వెళ్తాయని.. రోజా విషయంలో తాను తగ్గేది లేదని జవాబిచ్చారట.