బొత్స సత్యనారాయణ స్వరం మారిపోయిందిగా?

బొత్స సత్యనారాయణ.. తెలుగు రాజకీయాలతో  ఏ మాత్రం పరిచయం ఉన్నా.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. అంతగా బొత్స సత్యనారాయణ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న సమయంలో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికలకు ముందు ఆయన విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అయితేనే భేషుగ్గా ఉంటుందన్న ప్రకటన కూడా చేశారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తరువాత తీరిగ్గా వైసీపీలోకి జంప్ చేసేశారు. 2019 ఎన్నికలలో చీపురుపల్లి నుంచి విజయం సాధించి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. జగన్ తొలి, మలి కేబినెట్ లలో స్థానం దక్కించుకున్న అతి కొద్ది మందిలో బొత్స ఒకరు. అంతగా ఆయన అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటం ఎలా అన్న విద్యలో ఆరితేరిపోయారు. 

సరే ఇప్పుడు అంటే 2024లో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు. వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించు కోలేకపోయింది. అది వేరే సంగతి కానీ ఎన్నికలు అయిన తరువాత ఫలితాలు రావడానికి ముందు బొత్స సత్యనారాయణ వైసీపీ విజయం, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం పై బోలెడంత ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఢంకా బజాయించి మరీ చెప్పారు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత, పార్టీతో సహా తానూ పరాజయాన్ని మూటగట్టుకున్న అనంతరం బొత్స వ్యూహాత్మకంగా కొంత కాలం వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు తన రాజకీయ చాణక్యం చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై అదే పనిగా  పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పనిలో పనిగా తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సరిగా పని చేయలేదని చెప్పకనే చెప్పేస్తున్నారు. 

పింఛన్ సొమ్ము పెంచి జులై 1వ తారీకు నుంచే అందించడం  అభినందనీయమని చప్పట్లు కొట్టేస్తున్నారు. అంతేనా ప్రభుత్వం మారినప్పుడు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ ల మార్పు సహజమేననీ, దీనిని రాజకీయ కక్ష సాధింపుగా భావించడం సరికాదని ఎవరూ అడగకుండానే తన అమూల్య అభిప్రాయాన్ని వెలిబుచ్చిన బొత్స..  రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ల జగన్‌ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందన్న చంద్రబాబు విమర్శపై చాలా ఆచితూచి స్పందించారు.  ఆ విషయం రాబోయే రోజుల్లో తేలుతుందన్నారు. అంతే కాదు.. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు, మూకలు  తెలుగుదేశం కార్యాలయాలపై జరిపిన దాడులు తప్పేనని బేషరతుగా అంగీకరించేశారు. అలాగే తాను ఆనాడే ఈ దాడులను తప్పుపట్టానని చెప్పుకొస్తున్నారు. 

తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలతో కొన్ని సమస్యలు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు.  విద్యాశాఖ మంత్రిగా తాను ఉపాధ్యాయుల సమస్య పరిష్కారంలో విఫలమయ్యానని అంగీకరించేశారు. ఇక అన్నిటికంటే ముఖ్య మైనదేమిటంటే.. ఎన్నికలలో వైసీపి ఓటమికి ఈవీఎంలే కారణమని అవి టిడిపి చేతిలో శకుని పాచికల్లా మారాయని జగన్మోహన్‌ రెడ్డి ఓ వైపు లేఖలు, ప్రకటనలు, విమర్శలు గుప్పిస్తుంటే.. మాజీ మంత్రి బొత్స సత్యనా రాయణ మాత్రం ప్రజలు  తమ పాలనను, విధానాలను  ఆలోచనలను పూర్తిగా తిరస్కరించారని ఎలాంటి శషబిషలూ లేకుండా ఒప్పుసుకుంటున్నారు. ఇలా తెలుగుదేశం అధినేతను పొగిడేస్తూ, సొంత పార్టీ అధికారంలో ఉండగా తప్పులు చేసిందనీ, పాలనలో విఫలమైందనీ ఒప్పేసుకోవడం ద్వారా సైకిలెక్కేయడానికి ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. అయితే బొత్స తెలుగుదేశం గూటికి వద్దామన్నా అక్కడ ఆయనకు స్థానం లేదని తెలుగుదేశం శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.  బొత్సకు కూడా తనకు తెలుగేదేశం ఎంట్రీ అంత వీజీ కాదని తెలుసు. అయితే చంద్రబాబును పొగిడి,  జగన్ తప్పిదాలను ఎత్తి చూపడం ద్వారా ముందు ముందు తెలుుగదేశం పార్టీ తనను ఇబ్బందులు పెట్టకుండా ఉంటుందని ఆయన ఆశపడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.