ఇంకా మిల్లుకు చేరని పంటలు! ఆహార కొరత త‌ప్ప‌దా!

లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తే… ప్రస్తుతం వలస కూలీలే కాదు… మధ్య తరగతీ తిండి కోసం తిప్పలు తప్పని పరిస్థితి. 

మూతబడిన మిల్లులు, కార్మికులు, కూలీలు విధులకు హాజరుకాలేకపోవడం, పంటలు ఇంకా వ్యవసాయ క్షేత్రాల్లోనే నిలిచిపోవటంతో ధాన్యం, పప్పులు ఇంకా మిల్లులకు చేరని పరిస్థితి. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 4000 రైస్‌ మిల్లులు మూతపడగా… కనీసం 4 లక్షల మంది కార్మికులు ఇళ్లల్లో మగ్గిపోతున్నారు.

రబీ సీజన్‌ పంటలు ఈపాటికే మిల్లులకు చేరుకోవాల్సి ఉండగా లాక్‌డౌన్‌ వల్ల వ్యవసాయ కూలీలు, కార్మికుల కొరత తీవ్రం కావడంతో 75 శాతం మిల్లులు పనిచేయడంలేదు.
దేశవ్యాప్తంగా ఏడాదికి 22 మిలియన్‌ టన్నుల గోధుమపిండి, మైదాను మిల్లులు సప్లై చేస్తుంటాయని, కరోనా కారణంగా గోధు మలు, కార్మికుల లభ్యత క్షీణించి 40 నుంచి 50 శాతం పిండి మాత్రమే ఉత్పత్తి అవుతోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  అలాగే వంట నూనెల తయారీ 40 శాతం తగ్గింది.  

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రబీ సీజన్‌లో 30 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరా శాఖకు సుమారు రూ. 25 వేలకోట్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1280 పీపీసీలను ప్రారంభించింది. పొలం నుంచి ధాన్యం గింజలను పీపీసీలకు తరలించే అవకాశమే లేదు. లాక్‌డౌన్‌ సందర్భంగా గ్రామాల్లో రైతులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వటం లేదు. కనీసం పొలంలో వరి కోతలకు కూలీలనూ బయటకు రానివ్వటం లేదు. 

తెలంగాణాలో 37 లక్షల టన్నుల ధాన్యం చేతికి వస్తుందని అంచనా. ఎఫ్‌సీఐ ముతక రకం బియ్యాన్ని సేకరిస్తుంది. సామాన్య జనం సైతం వినియోగించే సోనా మసూరీ, సాంబ మసూరీ, తెల్లమసూరీ, గిద్ద మసూరీ, విజయ మసూరీ, బీపీటీ, జీలకర్ర సన్నాలు, మొలగొలుకులకే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని వినియోగించే పరిస్థితి లేదు. మిల్లుల్లో మర ఆడక పోవటంతో బియ్యం కొరత వేధించనుంది. 

రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు మిల్లులకు నేరుగా చేరుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఆహార కొరత ఏర్పడకుండా ఉండగలదన్న ఆశాభావాన్ని మిల్లర్లు, వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు.