బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం కొరత!  లాక్‌డౌన్‌తో వెళ్లలేకపోతున్న దాతలు!

లాక్‌ డౌన్‌కు ముందు రక్త దానం చేయడానికి ఒక్కో బ్ల‌డ్‌బ్యాంక్‌కు రోజుకు 50-60 మంది వచ్చేవారు. ఇప్పుడు ఎవరూ రావడంలేదు. రక్త దాతలతో మాట్లాడితే.. తమకు కూడా రావాలని వుందని, అనుమతి కావాలని కోరుతున్నారు. దాతలు ఎవరూ లేకపోవడం వల్ల సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. రక్తం అవసరాలు పెరుగుతున్నాయి.

సాధారణ సమయాల్లో ప్రతి బ్లడ్‌ బ్యాంకులో 100 నుంచి 200 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటుంది. అత్యవసరమై వచ్చేవారికి వాటిని అందిస్తుంటారు. రక్తం తీసుకునేవారు ప్రతిగా వారి కుటుంబ సభ్యుల ద్వారానో, మిత్రుల ద్వారానో రక్తం ఇస్తుంటారు. ఇది కాకుండా రక్తదాన శిబిరాల ద్వారా బ్లడ్‌ బ్యాంకులకు రక్తం సమకూరుతుంది. విద్యా సంస్థలు, నేవీ, కొన్ని ప్రైవేటు సంస్థలు తరచూ శిబిరాలు నిర్వహించి రక్తం ఇస్తుంటాయి. పేరొందిన ప్రజాప్రతినిధులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శిబిరాలు నిర్వహించి, రక్తం సేకరించి ఇస్తుంటారు. 

ప్ర‌స్తుతం ఆపదలో వచ్చిన వారికి రక్తాన్ని అందజేయలేక పోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడేవారికి ప్రతి నెలా తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. ఈ వ్యాధిగ్రస్థులు తమకు అందుబాటులో ఉన్న బ్లడ్‌బ్యాంకులో పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రతి బ్యాంకులోనూ ఇలాంటి వారి సంఖ్య 50 నుంచి 100 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధిగ్రస్థులకు, అత్యవసరమైన డెలివరీ కేసులకు మాత్రమే ఇస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

లాక్‌డౌన్ కారణంగా రక్త సేకరణ శిబిరా లు జరగడంలేదు. దీంతో రక్తం అవసరమయ్యే రోగుల కోసం రక్తదాతలు ముందుకు రావాలని ఐపిఎం(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటి న్ మెడిసిన్) ప్రకటించింది. రక్తం ఇవ్వాలనుకునే దాతలు నేరుగా ఐపిఎంకి రావాలని డైరెక్ట ర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నారాయణగూడలో ఉన్న ఈ కేంద్రంలో ప్రతి రోజు సగటున 100 నుంచి 115యూనిట్లు సేకరిస్తున్నామని, వీటి ని మరింత విస్త‌రించి వేర్వేరు కాంపొనెంట్లగా కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే రక్తదాతలందరూ సులభంగా కేంద్రానికి చేరేందుకు ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ జిల్లా డిఎంహెచ్‌ఒ డా. వెంకటి 8497958597ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.