రామాపురం అలల్లో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు... కొనఊపిరితో ఒకరు మృతి 

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో బుధవారం( 02 ఏప్రిల్) విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. పర్చూర్ నెహ్రూ కాలనీకి చెందిన చుక్కా వంశీ, రాజేశ్ అనే యువకులు సరదాగా బీచ్ లో గడుపుతున్నారు. ఉదయం నుంచి సముద్రంలో అలలు విపరీతంగా వస్తున్నాయి. మెరైన్ పోలీసులు సందర్శకులను అలర్ట్ చేసినప్పటికీ ఈ ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగారు. సముద్రం నుంచి భారీ తెప్ప ఒకటి తీరం వైపు దూసుకొచ్చింది. తెప్ప తిరిగి సముద్రంలో వెళ్లే క్రమంలో ఇద్దరు యువకులను తీసుకెళ్లింది. ఎంతో చాకచక్యంగా మెరైన్ పోలీసులు వారిని తీరంకు తీసుకొచ్చారు. ఇందులో వంశీ (27) నీళ్లను మింగడం వల్ల పరిస్థితి విషమించడంతో చీరాల ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే వంశీ తుది శ్వాస విడిచాడు. పంచభూతాలలో ఒకటైన నీటిని తక్కువ అంచనా వేస్తే  పరిణామాలు కూడా దారుణంగా ఉంటాయని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదహరణగా మిగిలింది.