రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి
posted on Jan 13, 2026 11:55AM

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ గ్రీన్ సిటీ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ గౌడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్ లో భారీగా ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువైంది. ప్లాస్టిక్ కాలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు ఆ ప్రాంతం అంతా కమ్ముకున్నాయి. దట్టమైన పొగ, ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ప్లాస్టిక్ కాలి పొగ వ్యాపించడంతో స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద కారణాలు వెంటనే తెలియరాక పోయినప్పటికీ, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించిందని తెలుస్తోంది.