ఫాదర్స్ డే వెనుక ఓ విషాదగాథ
posted on Jun 18, 2016 11:16AM
మొన్నటివరకూ ఫ్రెండ్‌షిప్ డే, మదర్స్ డే... లాంటి రోజుల గురించే వినేవారు. ఇప్పుడు రాన్రానూ ఫాదర్స్ డేకి కూడా ప్రచారం పెరిగిపోతోంది. ప్రతిరోజూ గౌరవించుకోవల్సిన తండ్రి కోసం ప్రత్యేకంగా ఓ రోజేమిటంటూ కొందరు నిష్టూరాలాడుతుంటే... ఆ తండ్రి సేవలని గుర్తించేందుకు ఓ రోజు ఉండటంలో తప్పేమిటన్నది మరికొందరి వాదన. ఏది ఏమైనా ఫాదర్స్ డే ఇప్పటి సమాజంలో ఓ భాగం. అలాగని ఇదేదో ఈ మధ్యకాలంలో వచ్చిన సంప్రదాయం కాదు. దాదాపు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓ సందర్భం. ఆ చరత్రలో ఓ విషాదం కూడా దాగి ఉండటమే ఆశ్చర్యపరిచే విషయం.
డిసెంబరు, 6-2007: అమెరికాలోని పశ్చిమ వర్జీనియాలో ‘మొనొన్‌గా’ అనే ఓ పట్టణం. ఆ పట్టణం ఓ బొగ్గు గనికి ప్రసిద్ధం. అలాంటి గనిలో ఆ ఉదయం ఓ అసాధారణమైన పేలుడు సంభవించింది. భూమి కంపించిపోయేట్లుగా గని పైకప్పు విరిగిపడిపోయేట్లుగా ఏర్పడిన ఆ పేలుడుతో గనిలోని రెండు భాగాలు కుప్పకూలిపోయాయి. ఆ సమయంలో గనిలో 367 మంది ఉండగా, వారిలో 362మంది చనిపోయారంటే పేలుడు ఏ స్థాయిలో నష్టం కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు జరిగిన ప్రాంతానికి రక్షణ బృందాలు చేరుకున్నా పెద్దగా ఉపయోగం లేకపోయింది. గని పై కప్పు కూలిపోవడం, లోపలికి గాలి వెళ్లే వెంటిలేషన్ వ్యవస్థ ధ్వంసం కావడంతో... ఎవరినీ పెద్దగా కాపాడలేకపోయారు. అందుకనే అమెరికా చరిత్రలో అతి దారుణమైన మైనింగ్ ప్రమాదంగా ఈ విషాదాన్ని పరిగణిస్తారు.
మొనొన్‌గా గనిలో అంత భారీ పేలుడు ఎలా సంభవించిందో ఇప్పటికీ అంతుపట్టని విషయమే! గనిలో పేరుకుపోయిన మీథేన్ వంటి ప్రమాదకర వాయువులకి ఒక్కసారిగా నిప్పంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఓ అంచనా. ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయినవారిలో అత్యధికులు ఇటలీ నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన శరణార్థులే కావడం మరో విషాదం. గనిలో పనిచేసేవారు చనిపోవడం మాట అటుంచితే, వారి మీద ఆధారపడి ఉన్న కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. దాదాపు వేయిమందికి పైగా పిల్లలు అనాథలు అయ్యారని ఓ అంచనా. ప్రభుత్వం ఏదో తూతూమంత్రంగా వీరికి పునరావాసం కల్పించినా... తండ్రి లేని వారి లోటుని మాత్రం ఎవరు తీర్చలేకపోయారు.
మొనన్‌గా గనిలో తన తండ్రిని కోల్పోయినవారిలో ‘గ్రేస్ గోల్డెన్ క్లేటన్’ అనే ఆమె ఒకరు. ఆ విషాదంలో చనిపోయిన తండ్రులందరికీ సంతాపంగా స్థానిక చర్చి సాయంతో జులై 1908న ఒక ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించారు. ఆ రోజుని ఫాదర్స్ డేగా గుర్తించారు. అయితే క్లేటన్ నిర్వహించిన ఈ ఫాదర్స్ డేకి పెద్దగా ప్రచారం లభించలేదు. కానీ 2010లో ‘సొనారా స్మార్ట్ డోడ్’ అనే ఆమె 2010లో ఫాదర్స్ డేని నిర్వహించాలని తలపెట్టడంతో కథ మళ్లీ మొదలైంది. సొనారా ఫాదర్స్ డే ను ప్రారంభించాలని కోరుకోవడం వెనుక ఒక వ్యక్తిగత కారణం కూడా ఉంది. సొనారా తండ్రి ఓ మాజీ సైనికుడు. తన భార్య చనిపోయినా కూడా ఆయన ధైర్యాన్ని కోల్పోకుండా ఆరుగురు పిల్లలను పెంచి పెద్దచేసుకుంటూ వచ్చాడు. అటు యుద్ధ రంగంలో ఎలాగైతే నిబ్బరంతో గెలుపొందాడో, ఇటు విధితోనూ అదే తెగువతో పోరాడాడు. ఆయనలాంటి తండ్రుల గౌరవార్థం ‘ఫాదర్స్ డే’ ను నిర్వహించాలనుకుంది సొనారా. స్థానిక చర్చి అధికారులతో సంప్రదింపులు జరిపిన మీదట జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌డేగా నిర్ణయించారు. అలా తొలి ఫాదర్స్ డేని 1910, జూన్ 19న నిర్వహించారు. ఈసారి ఫాదర్స్ డే కూడా అదే రోజున రావడం గమనార్హం.
నిజానికి మదర్స్ డేకి ఉన్న ప్రాధాన్యత ఫాదర్స్‌డేకి మొదటి నుంచీ ఉండేది కాదు. మదర్స్‌డేకి అనుకరణ అనీ, వ్యాపారస్తులు మాత్రమే ప్రోత్సహించే పండుగ అనీ తరచూ విమర్శలను ఎదుర్కొంటూ ఉండేది. కానీ రోజురోజుకీ ప్రచారం పెరగడం వల్లనో, లేక తండ్రి పాత్రలో పెనుమార్పులు రావడం వల్లనో... పిల్లల కోసం తండ్రులు పడే శ్రమను గుర్తించే రోజుగా ఫాదర్స్ డే ప్రాముఖ్యం నానాటికీ పెరుగుతోంది.
- నిర్జర.