నవ్వులాట కాదు!

 

 

నవ్వు నాలుగువిధాలా చేటే కావచ్చు. కానీ నలభై రకాలుగా ఆరోగ్యం కూడా! నవ్వడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనీ, నోటి కండరాలకి వ్యాయామంగా ఉంటుందనీ, నానారకాల రోగాలనీ నివారిస్తుందనీ... ఇలా నవ్వు వల్ల ఏర్పడే లాభాల గురించి పుంఖానుపుంఖాలుగా చదువుకున్నాం. కానీ నవ్వు ద్వారా మనిషి మనస్తత్వం తేలిపోతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. అంటే నవ్వు ఓ సరదా కాదు... మన మనసుని బయటపెట్టేసే ఓ సాధనం అన్నమాట!

 

 

పెదాలను బిగపెట్టి! చాలా సాధారణంగా కనిపించే నవ్వు. పెదాలను బిగపెట్టి కాస్త వెనక్కి కదిల్చే నవ్వు ఇది. అపరిచితులతో సైతం ఏదో మర్యాద కోసం నవ్వేసే నవ్వు. ఆత్మవిశ్వాసం లేకపోయినా, సిగ్గరి మనస్తత్వం ఉన్నా కూడా ఇలాగే పెదాలను బిగపెట్టి నవ్వేస్తూ ఉంటారు. తరచూ ఇలా నవ్వేవారు తమలోని భావాలను పంచుకోనివారై ఉంటారు. ఇలాంటి నవ్వు వల్ల ప్రమాదం అయితే లేదు కానీ, మనవాడు అన్న భావన మాత్రం కలుగదు.

 

 

కోర నవ్వు! కొందరు పెదాలను ఒకవైపు మాత్రమే పైకి వంచి నవ్వడాన్ని మనం గమనించవచ్చు. తమ మీద తమకి విశ్వాసం ఎక్కువగా ఉన్నవారు ఇలా నవ్వుతూ ఉంటారు. చూసేవారికి ఇది తమను ఎగతాళి చేసేందుకు ఉపయోగించిన భావంగా తోస్తుంది. నిజంగానే అవతలివారు చెప్పే మాటలు మరీ తేలికగా ఉన్నాయని భావించే సందర్భాలలో ఇలాంటి నవ్వుని గమనించవచ్చు. అవతలివారితో చిలిపిగా ప్రవర్తించేటప్పుడు కూడా... ఇలాంటి నవ్వు సహజమే! సందర్భాన్ని బట్టి భావం మారుతుందంతే!

- ఇక కోర నవ్వుని కూడా నవ్వీ నవ్వకుండా బలవంతంగా కనిపిస్తున్నట్లయితే అవతలి మనిషి, తాను ఉన్న పరిస్థితులలో అంత సౌఖ్యంగా లేడని అర్థం. మొహమాటంగా ఉన్నాడనో, మనతో మాట్లాడటం ఇష్టం లేదనో ఇలాంటి నవ్వు తెలియచేస్తుంది.

 

 

బలవంతపు నవ్వు! కొందరు కారణం లేకున్నా మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్లు కనిపిస్తారు. అవతలి వారి మనసుని నెగ్గడానికో, లేని సంతోషాన్ని వెలిబుచ్చడానికో ఇలా చేస్తుంటారు. కానీ ఇలాంటి నవ్వు అవతలి వారి మనసులో ఏమంత సానుకూల భావనను కలిగించదు. పైగా ‘ఎందుకలా నవ్వుతున్నాడు. ఇతని మనసులో ఏదో దుర్బుద్ధి ఉంది,’ అన్న నిరసన భావన కూడా కలగవచ్చు. నవ్వు నాలుగు విధాలా చేటు అన్నది ఇలాంటి సందర్భాలలోనే!

 

 

మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు! పళ్లు కనిపించినా కనిపించకపోయినా, పెదాలని విశాలంగా సాగదీస్తూ కళ్లతో సైతం నవ్వుని ఒలికించే నవ్వు అందరికీ అనుభవమే. అవతలి మనిషి ఏదో మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా నవ్వుతాన్నడన్న భావనను ఇది కలిగిస్తుంది. వారి నవ్వుతో చుట్టుపక్కల కూడా సంతోషకరమైన వాతావరణ వెల్లివిరుస్తుంది.

ఇవే కాకుండా సిగ్గుపడుతూ సాగే నవ్వులూ, నిరంతరం పళ్లని బయటపెడుతూ సాగే మనుషులూ, చటుక్కున వెలిగి ఆరిపోయే నవ్వులూ.... ఇలా రకరకాల నవ్వులు మనకి తారసపడుతూనే ఉంటాయి. గమనించాలే కానీ లిప్తపాటున సాగే ఈ నవ్వులు, అవతలి మనిషి ఎలాంటివాడో చెప్పేస్తూ ఉంటాయి.

 

- నిర్జర.