ఒక ఫేస్‌బుక్‌ పేజి.. వేలమందిని కాపాడుతోంది!

 

ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఓ వ్యసనం. ఓ కాలక్షేపం! లైక్‌లను కూడబెట్టుకుంటూ, షేర్‌లను లెక్కపెట్టుకుంటూ ఆత్మతృప్తిని పొందే ఓ సాధనం. మనసుండాలే కానీ అలాంటి మాధ్యమాన్ని కూడా మంచి పనికి ఉపయోగించవచ్చని నిరూపించాడు ఓ బస్సు కండక్టరు. కేరళ రాష్ట్ర బస్సు రవాణా సంస్థలో పనిచేసే వినోద్‌ భాస్కరన్‌కి వచ్చిన ఆ ఆలోచనే ఇప్పుడు ఆ రాష్ట్రమంతా ఓ ఉద్యమంగా సాగుతోంది.

 

2011: నలుగురూ ఓ చోటకి చేరుకునే ఫేస్‌బుక్‌ని ఏదన్నా సామాజిక సేవ కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది వినోద్‌కి. ఆలోచన రావడమే తడవుగా, రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ తన పేజిలో పోస్టింగులను ఉంచడం మొదలుపెట్టాడు. స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసేవారు ఎవరంటూ పిలుపుని ఇవ్వడం మొదలుపెట్టాడు. వినోద్‌ పిలుపుకి అనూహ్యమైన స్పందన వచ్చింది. వందల మంది తాము రక్తాన్ని దానం చేసేందుకు సిద్ధం అంటూ ముందుకు వచ్చారు. ఒక చిన్నపాటి పిలుపుకి ఇంత స్పందన వస్తుందని వినోద్‌ సైతం ఊహించలేదు. దాంతో రక్తదానం కోసం ఏకంగా ‘బ్లడ్‌ డోనర్స్‌ కేరళ’ పేరుతో ఒక ఫేస్‌బుక్‌ పేజీనే ప్రారంభించాడు.

 

 

2015: రక్తాన్ని దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నవారంతా ఈ ‘బ్లడ్‌ డోనర్స్‌ కేరళ’కు అందుబాటులో ఉంటారు. వారు ఉండే ప్రాంతంలో ఎవరికైనా రక్తం అవసరమైతే ఈ ఫేస్‌బుక్‌ ద్వారానే ఎవరో ఒకరు వారిని సంప్రదించవచ్చు. అంతేకాదు! ఈ ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ఏర్పడిన మిత్రులంతా కలిసి అప్పుడప్పుడూ రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలా ఇప్పటికి 60కి పైగా శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు సజావుగా సాగేందుకూ, తాము కూడా రక్తదానాలలో పాలుపంచుకునేందుకు వచ్చే యువతని చూస్తూ ఆశ్చర్యం వేస్తుంది. ఇంజనీర్లు, సాఫ్టవేర్‌ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులు... ఇలా అన్ని రంగాల యువతా ఇందులో పాలుపంచుకుంటూ కనిపిస్తారు.

 

2016: ఈ బృందంలోని జోబి అనే కుర్రవాడైతే తన పెళ్లి జరుగుతున్న సందర్భంలో ఓ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి శభాష్‌ అనిపించాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా మీడియాలో రావడంతో ‘బ్లడ్‌ డోనర్స్‌ కేరళ’కు అండగా నిలిచేవారి సంఖ్య మరింతగా పెరిగిపోయింది. ఫేస్‌ బుక్‌ ద్వారా ఈ రక్తదాన కార్యక్రమం విజయవంతం కావడంతో ఇప్పుడు దీన్ని వాట్సప్‌కు కూడా విస్తరిస్తున్నారు నిర్వాహకులు. ఒకే ఊరిలో ఉండే కార్యకర్తలు వాట్సప్‌ ద్వారా రక్తదానానికి అందుబాటులో ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఈ బృందంలోని సభ్యులు కేవలం రక్తదానానికే పరిమితం కాకుండా పేద విద్యార్థుల చదువుకి, అనాథాశ్రమాలలో భోజనాలకీ... ఇలా ఏదో ఒక సేవా కార్యక్రమానికి ఇతోధికంగా సాయం చేయడం మొదలుపెట్టారు.


- నిర్జర.