మనిషి మనిషిలా బతికేదెన్నాళ్లు

 

అనగనగా భగవంతుడు సృష్టిని చేస్తున్నాడు. ముందరగా ఆయన ఓ కుక్కను సృష్టించాడు. ‘చూడూ నీకు ముప్ఫై ఏళ్ల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా, నీది అనుకున్న ఇంటిని కాపలా కాస్తూ ఉండటం. నీ జోలికి ఎవరన్నా వస్తే వారి వెంట పడి అరిచి అరిచి మీదపడి కరవడం. సరేనా!’ అన్నాడు.

 

దానికి కుక్క ‘అరవడం, కరవడం గురించి వింటుంటే సరదాగానే ఉంది కానీ మరీ ముప్ఫై ఏళ్లపాటు అలా గడపడమే కష్టమనిపిస్తోంది. కాబట్టి ఓ పదేళ్లపాటు అలా జీవిస్తే చాలనిపిస్తోంది. మిగతా ఇరవై ఏళ్లూ మీరే ఉంచేసుకోండి’ అనేసింది.
‘సరే, నీ ఇష్టం!’ అంటూ కుక్కను భూమ్మీదకు వదిలాడు భగవంతుడు.

 

అలా కుక్కను సృష్టించిన తరువాత కోతిని సృష్టించాడు. ‘చూడూ నీకు నలభై ఏళ్ల ఆయుష్షుని ఇస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా, నా కోతి చేష్టలతో జనాల దృష్టిని ఆకర్షించడమే. సరేనా!’ అన్నాడు. దానికి కోతి ‘జనాల దృష్టిని ఆకర్షించడం బాగానే ఉంటుంది. కానీ మరీ నలభై ఏళ్ల పాటు అలా గడపడం అంటే చిరాగ్గా ఉంటుంది. విసుగేసిపోతుంది. కాబట్టి ఓ ఇరవై ఏళ్లు పాటు జీవిస్తే చాలు. మిగతా ఇరవై ఏళ్లూ మీరే ఉంచేసుకోండి’ అనేసింది. ‘సరే, నీ మాటను ఎందుకు కాదనాలి!’ అంటూ కోతిని భూమ్మీదకు వదిలాడు దేవుడు.

 

 

ఈసారి ఆవు వంతు వచ్చింది. ‘నిన్ను సృష్టిస్తుంటే నాకే జాలిగా ఉంది. నీకు అరవై ఏళ్ల జీవితకాలం ఇస్తున్నాను. నువ్వు దూడలను కని పోషించాలి. అవసరమైతే రైతుకి తోడుగా పొలాల్లో పనిచేయాలి. వట్టిపోతే చావుకోసం ఎదురుచూస్తూ కూర్చోవాలి.’ అన్నాడు భగవంతుడు.

 

దానికి ఆవు ‘సరే! మీరు నా నుదుటిన ఎలా రాస్తే అలా జరుగుతుంది. కాకపోతే ఒక్క మేలు చేయండి దేవా! ఇన్నేసి కష్టాలను అన్నేసి ఏళ్లపాటు భరించడం నా వల్ల కాదు. అందుకని ఒక మూడో వంతు జీవితాన్ని మాత్రమే నాకు ఇచ్చి, మిగతా నలభే ఏళ్లూ మీరే తీసేసుకోండి’ అని వేడుకొంది.దానికి భగవంతుడు సరేనంటూ, ఆవుని భూగ్రహం మీదకు వదిలాడు.

 

ఇక మనిషి వంతు వచ్చింది. ‘బాబూ, నీకు 20 ఏళ్ల ఆయుష్షుని ఇస్తున్నాను! తిను, కష్టపడు, నిద్రపో, ఆడు, పాడు.... పండగచేస్కో. ఈ ప్రపంచంలోని జీవులన్నింటికీ నువ్వే యజమానవి’ అని ఆశీర్వదించాడు.

 

 

కానీ మనిషి ఎంతైనా స్వార్థపరుడు కదా! భగవంతుని చేతిలో ఆయుష్షు పోసుకుంటూనే తన స్వార్థాన్ని చూపించేశాడు ‘జీవితాన్ని అనుభవించడానికి మరీ ఇరవై ఏళ్లేనా! కనీసం నిండు నూరేళ్లయినా లేకపోతే అదేం జీవితం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం వందేళ్ల జీవితం కావల్సిందే!’ అని పట్టుపట్టాడు.

 

మనిషి మాటలకు ఏం చేయాలో దేవునికి పాలుపోలేదు. ‘సరే ఒక పని చేస్తాను. నా దగ్గర కుక్కవి ఓ ఇరవై ఏళ్లూ, కోతివి ఓ ఇరవై ఏళ్లూ, ఆవువి ఓ ఇరవై ఏళ్లూ మిగులుగా ఉన్నాయి. వాటన్నింటినీ నీ ఆయుష్షుకి కలిపితే వందేళ్లు పూర్తవుతుంది. కానీ తరువాత జరిగే పరిణామాలకి మాత్రం నాది బాధ్యత కాదు. సరేనా!’ అని అడిగాడు.

 

‘ఓ దానిదేం భాగ్యం. నాకు వందేళ్ల ఆయువు ఉంటే చాలు’ అంటూ భూమ్మీదకి దూకేశాడు మనిషి. అలా మనిషి జీవితం వందేళ్లనుకుంటే అందులో ఇరవై శాతం మాత్రమే తనలా ఉంటాడట. మిగతా ఇరవై శాతం కాలాన్నీ తనది అనుకున్న ఆస్తిని కాపాడుకునేందుకు, తోటి వారి మీద ద్వేషంతో అరుస్తూ కరుస్తూ ఉండేందుకు ఉపయోగిస్తుంటాడు. మరో ఇరవై శాతం జీవితంలో చుట్టుపక్కల ఉన్న జనాలని ఎలాగైనా తనవైపు ఆకర్షించుకునే ప్రయత్నంలో గడిపేస్తూ ఉంటాడు. ఇక మిగిలిన జీవితమేమో బండచాకిరీ చేస్తూ, ఇతరుల కోసమే జీవిస్తూ ఉంటాడు.

 

..Nirjara