తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు!!
posted on Jan 26, 2019 3:40PM
తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు గడిచినా పూర్తి స్థాయి మంత్రివర్గం కొలువు తీరలేదు. సీఎం కేసీఆర్‌తోపాటు మహమూద్ అలీ మాత్రమే ప్రస్తుతం కెబినేట్‌లో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందా? అని ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు, అనంతరం కేసీఆర్ చేపట్టిన సహస్ర మహా చండీయాగంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు విడతల పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. 30న మూడో దఫా జరగనుంది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపడతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఈ నెల 31న లేదా వచ్చే నెల తొలివారంలో కేబినేట్ విస్తరణకు అవకాశం ఉందని అంటున్నారు. మార్చి తొలివారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆలోగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అంతకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అన్నీ కుదిరితే నెలాఖరు లేదంటే వచ్చే నెల తొలివారంలో కేబినేట్ విస్తరణ ఉంటుందంటూ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విస్తరణ చేపట్టినా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోరని పరిమిత సంఖ్యలోనే మంత్రులు ఉంటారన్న ప్రచారం సాగుతోంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఆ తర్వాతే పూర్తిస్థాయి కేబినేట్ కొలువుదీరవచ్చని అంటున్నారు. పరిమిత విస్తరణలో ఆరు లేదా ఎనిమిది మందికి మంత్రి పదవి దక్కవచ్చని భావిస్తున్నారు.