కవిత నివాసంలో ఈడీ సోదాలు.. ఏం జరుగుతోంది?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కులు మరింత చిక్కబడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. నందినగర్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు శుక్రవారం (మార్చి 15)న సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. తొలుత కవిత నివాసంపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు అంతా భావించారు. అయితే ఆ తరువాత ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. అలాగే కేవలం మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మాత్రమే కాకుండా కవిత భర్త వ్యాపార లావీదావీలపై కూడా కూపీ లాగుతున్నట్లు చెబుతున్నారు. మొత్తం నాలుగు బృందాలు ఈ సోదాలలో పాల్గొన్నాయని చెబుతున్నారు. 

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీం కోర్టు ముందకు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ విచారణ ఇలా వాయిదా పడిందో లేదా అలా కవిత నివాసంపై ఈడీ సోదాలు మొదలవ్వడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది.

 కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టులో     జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం (మార్చి 15)న విచారణకు వచ్చింది.  వాదనల అనంతరం ఈ నెల 19కు వాయిదా పడింది. ఇటువంటి తరుణంలో  ఈడీ   ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి కవిత నివాసంలో తనిఖీలు చేపట్టడం, అదీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు ఈ సోదాలు జరగడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.