ఏపీకి వరుస తుపాన్లు ముప్పు!
posted on Oct 7, 2024 10:11AM
ఆంధ్రప్రదేశ్ కు ఈ నెలలో మరో మూడు తుపాన్ల ముప్పు ఉంది. భారత వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ నెల 10 తరువాత ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా మూడు తుపాన్లు రాబోతున్నాయి. వీటిలో అరేబియా సముద్రంలో ఏర్పడే తుపాను, బంగాళాఖాతంలో ఏర్పడే రెండు తుపాన్ల కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి తోడు ఈ నెల 10 తరువాత రాష్ట్రంలో వరుస తుపాన్లతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా జిల్లాల యాంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది.