తమిళనాట ఏపీ ఫార్మ్యులా.. పవన్ పొలిటికల్ స్కెచ్!?

ప‌వ‌న్ క‌ల్యాణ్.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఈ పేరు మారుమోగుతోంది. తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వివాదం విష‌యంలో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీశాయి. ఏపీలో సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన‌సాగుతున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఆయ‌న ఉన్న‌ట్లుండి త‌మిళనాడు రాజ‌కీయాల‌పై దృష్టిసారించిన‌ట్లు క‌నిపిస్తోంది. పవ‌న్ వ్యూహం వెనుక బిగ్ స్కెచ్ ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. వ‌చ్చే ఏడాది చివ‌రిలో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఆ ఎన్నిక‌ల నాటికి తాను అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకునేలా ప‌వ‌న్ ఇప్ప‌టి నుంచి క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంత‌కీ.. ప‌వ‌న్ త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఎలాంటి పాత్ర పోషించ‌బోతున్నారు.. ఏపీలో ఫార్ములాను త‌మిళ‌నాట ప్ర‌యోగించ‌బోతున్నారా.. ప‌వ‌న్ త‌మిళ రాజ‌కీయం అక్క‌డి సినీ ఇండ‌స్ట్రీపై ఎలాంటి ప్ర‌భావం చూప‌బోతుందో  అన్నన చర్చ మొదలైంది.

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసి పోటీచేశాయి. ఈ క్ర‌మంలో అసెంబ్లీ, పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సార‌ధ్యంలోని జ‌న‌సేన పార్టీ వంద‌శాతం స్టైక్ రేట్ తో విజ‌యం సాధించింది. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌వ‌న్ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  ఏపీలో వైసీపీ దారుణ ఓట‌మికి చంద్ర‌బాబుతోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ దికూడా కీల‌క భూమిక‌. చంద్ర‌బాబు వ్యూహం, ప‌వ‌న్ దూకుడుతో వైసీపీ కేవ‌లం ప‌ద‌కొండు స్థానాల‌కే ప‌రిమితం అయింది. ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యిని వినియోగించిన‌ట్లు లాబ్ రిపోర్టులు వ‌చ్చాయి. తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే దేశ‌వ్యాప్తంగానే కాక‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో కొలుస్తారు. అలాంటి తిరుమ‌ల‌లో జ‌గ‌న్ హ‌యాంలో క‌ల్తీ నెయ్యి వాడార‌నే విష‌యం పెద్ద దుమారాన్నే రేపింది. అప‌చారం జ‌రిగినందుకు క్ష‌మించ‌మ‌ని కోరుతూ ప‌వ‌న్  ప‌ద‌కొండు రోజుల‌ పాటు ప్రాయ‌శ్చిత్త దీక్ష‌  చేప‌ట్టారు. తిరుమ‌ల కొండ‌పై దీక్ష‌ను విర‌మించి  తిరుప‌తిలో వారాహి సభ  నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో వారాహి డిక్లరేషన్ చేస్తూ సనాతన ధర్మం గురించి ప‌వ‌న్ మాట్లాడారు. ఇదే క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేద‌ని సీరియస్‌గానే ప‌వ‌న్‌ వార్నింగ్ ఇచ్చారు.

 వారాహి స‌భ‌లో ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌ జ‌రిగింది.. త‌మిళ‌నాడులో అయితే పవన్ వ్యాఖ్యలు రాజ‌కీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై  ఉదయనిధి స్టాలిన్ స్పందించకపోయినా.. డీఎంకే పార్టీ, ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా రియాక్టయ్యారు. పవన్ కళ్యాణ్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. దీనికి తోడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై త‌మిళ‌నాడులో కేసు కూడా న‌మోదైంది. ఇదంతా ఒకెత్తయితే.. త‌మిళ‌నాడు గురించి ప‌వ‌న్ మాట్లాడిన ప్ర‌తి మాట వెనుక వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతున్నది. త‌మిళ‌నాట మ‌రో ఏడాదిన్న‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను టార్గెట్ గా చేసుకొని ప‌వ‌న్ ఇప్ప‌టి నుంచే త‌న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌ని,  ఆయ‌న వెనుక బీజేపీ పెద్ద‌లు ఉన్నార‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్త‌వానికి. త‌మిళ‌నాడులో ప‌ట్టు సాధించాల‌ని బీజేపీ ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నది.  కానీ, సాధ్యం కావటం లేదు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకేతో పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లినా పెద్ద‌గా ఫ‌లితం ద‌క్క‌లేదు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ విడిగా పోటీ చేసింది. క‌నీసం ఒక్క‌సీటును కూడా ద‌క్కించుకోలేక పోయింది. దీనికితోడు కాంగ్రెస్‌, డీకేఎం కూట‌మి 39 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో తమిళనాడులో బీజేపీ అన్నామలైను హైలెట్ చేసింది. అన్నామ‌లైకు రాష్ట్ర వ్యాప్తంగా విప‌రీతమైన క్రేజ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అది ఓటుగా మారలేదు. దీంతో   బీజేపీ ఈసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను త‌మిళ‌నాడులో ప్ర‌యోగించాల‌ని భావిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో హిందుత్వం పేరుతో ఎంట్రీ ఇస్తే.. అక్క‌డి సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తుంద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో ప‌వ‌న్ సైతం త‌మిళ రాజ‌కీయాల‌పై దృష్టి కేంద్రీక‌రించారు. హిందుత్వం పేరుతో త‌మిళ‌నాడులోని హిందువుల‌ను ఏక‌తాటిపైకి తీసుకురావ‌డంతో పాటు.. ఏపీలో ప్ర‌యోగించిన ఫార్ములాను త‌మిళ‌నాడులో ప్ర‌యోగించాల‌ని ప‌వ‌న్, బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. ఏపీలో ఎన్నిక‌ల ముందు బీజేపీ, టీడీపీని ఒకేతాటిపైకి తీసుకురావ‌డంలో ప‌వ‌న్ పాత్ర కీల‌మైంది. అదే స‌మ‌యంలో త‌మిళ‌నాడులో డీఎంకేకు గ‌ట్టి పోటీదారుగా ఉన్న అన్నాడీఎంకే, ఇత‌ర పార్టీల‌ను బీజేపీ ప‌క్క‌కు తీసుకొచ్చేలా ప‌వ‌న్ పావులు క‌దుపుతున్నారు. సినీ హీరో విజ‌య్ కొత్త పార్టీని స్థాపించిన విష‌యం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తామ‌ని ఇప్ప‌టికే విజ‌య్ చెప్పారు. విజ‌య్ కు త‌మిళ‌నాట మంచి క్రేజ్ ఉంది. డీఎంకే పార్టీ, విజ‌య్ పార్టీ మిన‌హా మిగిలిన అన్ని పార్టీల‌ను ఎన్డీయే కూట‌మిలోకి తీసుకొచ్చేలా ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు మొదలు పెట్టినట్లు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో డీఎంకే పార్టీకి బద్ధశత్రువైన.. అన్నాడీఎంకే పార్టీ గురించి ప‌వ‌న్ వ‌రుస‌ ట్వీట్లు చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

అన్నాడీఎంకే పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీఆర్ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ శ్రేణులకు, మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంజీఆర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌రోవైపు డీఎంకే, విజ‌య్ పార్టీలు ఎక్కువ‌గా క్రిస్టియ‌న్, ముస్లీం ఓట్ల‌పై దృష్టిసారించాయి. దీంతో ఎన్డీయే కూట‌మి ఆధ్వ‌ర్యంలో హిందుత్వ ఓట్ల‌ను టార్గెట్ చేయడమే బీజేపీ  లక్ష్యంగా చెబుతున్నారు‌. ఈ క్ర‌మంలో అన్నామ‌లైతో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్   సేవ‌ల‌ను కూడా బీజేపీ వినియోగించుకోబోతుంది. ప‌వ‌న్ ఇప్ప‌టికే రంగంలోకి దిగ‌డంతో త‌మిళ‌నాట రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. మ‌రి ప‌వ‌న్ టార్గెట్ రీచ్ అవుతారా.. ప‌వ‌న్ ద్వారా బీజేపీ అనుకున్న ల‌క్ష్యానికి చేరుకుంటుందా  అనేది వేచి చూడాల్సిందే.