ఏపీకి తరలనున్న సినీపరిశ్రమ?
posted on Oct 7, 2024 9:49AM
సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరల నుందా? తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోల నిర్మాణం, షూటింగులు జరుపుకోనుందా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఎవరైనా సరే ఔననే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో నటి సమంత, నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల రచ్చ రేవంత్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ గా మారిపోయింది. దీంతో తెలుగుసినీ పరిశ్రమ హైదరాబాద్ లో కొనసాగుతుందా, ఆంధ్రాకు తరలిపోతుందా అన్న చర్చ మొదలైంది.
నటుడు నాగార్జునకు మద్దతుగా తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఏకతాటిపై నిలబడటం, దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ముందు ముందు సినీపరిశ్రమ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సంబంధాలు మరింత చెడే అవకాశం ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలు హైదరాబాద్ ను వీడి ఏపీకి పరిశ్రమను తరలించాలని యోచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలే అంటున్నాయి. పరిశ్రమను ఏపీకి తరలించే విషయంలో తీవ్ర స్థాయిలో ఆలోచనలు, చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సాధించి పెడుతున్న తమ పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి కనీస గౌరవం లేకపోవడం బాధ కలుగుతున్నదని సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. దీంతోనే పరిశ్రమను ఏపీలోని విశాఖ తరలించాలనే ఆలోచన చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. దసరా తరువాత ఈ విషయంపై టాలీవుడ్ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశాలున్నాయంటేన్నారు. ఇదే జరిగితే హైదరాబాద్ సినీ నిర్మాణ ప్రాభవం పై గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది.
అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత వాటిని ఉపసంహరించుకుని సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సినీ పరిశ్రమ మొత్తం నాగార్జున కు మద్దతుగా నిలిచింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం ముఖ్యంగా పరిశ్రమకు చెందిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గా ఉండడం వల్ల పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని, అక్కడ తమకు సముచిత గౌరవం లభిస్తుందని పరిశ్రమ పెద్దలు అంటున్నారు. అంతే కాకుండా చంద్రబాబు గతంలోనే పరిశ్రమను విశాఖకు ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అక్కడకు తరలివేళ్లేందుకు యోచిస్తున్నారు. తమకు విశాఖలో స్థలాలు కేటాయిస్తే స్టూడియోలు నిర్మించుకుంటామని కొందరు పెద్దలు ఇప్పటికే ప్రకటించారు కూడా. తమకు గౌరవం లేనిచోట ఉండలేమని అంటున్నారు.
అన్నిటికీ మించి తెలుగుసినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరావడానికి ముఖ్య కారకుడు నాగార్జున తండ్రి, నటసామ్రాట్ అక్కినేనే అన్న సంగతి తెలిసిందే. ముందుగా ఆయనే అప్పటిలో మద్రాసును వదిలి హైదరాబాద్ కు వచ్చి అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి పూనుకున్నారు. అంతే కాకుండా తనతో సినిమాలు చేయాలననుకునే వారెవరైనా సరే హైదరాబాద్ కు రావలసిందేనని కచ్చితంగా చెప్పారు. అంటే నాడు టాలీవుడ్ హైదరాబాద్ తరలిరావడానికి తొలి అడుగు వేసింది అక్కినేని కుటుంబమే. అటువంటి అక్కినేని కుటుంబాన్నే అవమానిస్తే ఎలా సహించేది అంటూ టాలీవుడ్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సినీ పరిశ్రమ రేవంత్ సర్కార్ పై విశ్వాసాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో టాలీవుడ్ కు స్పష్టమైన హామీ ఇచ్చి సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోతే పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోవడం ఖాయమని అంటున్నారు.
అదే సమయంలో టాలీవుడ్ కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన హెచ్చరికలను బట్టి అటువంటి యోచన ఏదీ రేవంత్ సర్కార్ కు లేదని భావించాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ‘కొండా సురేఖపై టాలీవుడ్ నుంచి ఇంకొక్క మాట వచ్చినా సహించేది లేదు. ఆమె ఒంటరి కాదు.ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇక మాట్లాడొద్దు’ అని మంత్రి పొన్న ప్రభాకర్ మీడియా సమావేశం పెట్టి మరీ టాలీవుడ్ ను హెచ్చరించారు. దీంతో టాలీవుడ్ పట్ల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.