అంతర్జాతీయ భాష - అవకాశాల దిశ!!
posted on Apr 20, 2022 9:30AM
ప్రస్తుత కాలంలో ఉద్యోగాల కోసం పోటీ విపరీతంగా ఉంటుంది. ముఖ్యముగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడుతూ, పరిశ్రమలు స్థాపిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అయితే వచ్చిన చిక్కంతా భాష దగ్గరే. ఆ విదేశీ కంపెళలో పనిచేయడానికి ఆంగ్ల భాషలో ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలి. అయితే మన దేశంలో ఎంతోమంది ఇంగ్లీష్ సరిగా రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతిభ ఉన్నా భాష సరిగ్గా రాని కారణాన కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేక ఉద్యోగ అవకాశాల దగ్గర వెల్లకిలా పడుతున్నారు.
ఆంగ్లమంటే భయమా??
ఇంగ్లీష్ అనగానే చాలామంది తల కొట్టుకుంటారు. నిజానికి దానిని సబ్జెక్ట్ గా చూడకుండా మనం మాట్లాడే తెలుగులాంటి భాష అది కూడా అనే ఆలోచనతో దాని మీద కాస్త ఏకాగ్రత పెడితే ఇంగ్లీష్ పెద్ద కష్టమైనది కాదని ఎంతోమంది అంటారు. అంటే ఇంగ్లీష్ అంటే భయం వద్దు అని పరోక్షంగానే చెబుతున్నారు.
అవకాశాలు!!
ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష. మాతృభాష ఏదైనా సరే కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కానీ, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కానీ, అందరినీ అదుకునేది ఇంగ్లీష్ ఏ. ఇంగ్లీష్ అంతగా మనుషుల జీవితాలలో బాగమైపోయింది. పాశ్చాత్యుల భాషకు ఎందుకింత ప్రాధాన్యత ఇవ్వాలని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి మనుషులకు ఎన్నో అవకాశాలు కలిగేలా చేస్తున్నది ఇప్పుడు ఈ ఇంగ్లీష్ భాషనే. ఇంకా చెప్పాలంటే సాధారణ పాఠశాలలో పిల్లలకు బోధించడం దగ్గర నుండి, పెద్ద పెద్ద ఐటి సంస్థల వరకు ఇంగ్లీష్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కాబట్టి మెరుగైన అవకాశాలు అందుకోవాలి అంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ భాషను కూడా మోయాల్సిందే.
మెరుగు పడే జీవనశైలి!!
అందరూ ఒక విషయం అర్ధం చేసుకోవాలి. భారతీయుల జీవితం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారి జీవితమే ఉత్తమమైనది అనుకోడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో నివసించే వారి జీవితాలు వారికి అత్యుత్తమంగా అనిపిస్తాయి. కాబట్టి మనుషులు అవకాశాల పరంగా ప్రాంతాలు మారుతూ ఉంటే అక్కడి జీవనవిధానం, అక్కడి మనుషుల పరిచయాలు చూస్తుంటే మన జీవనసరలి ఎంతో మెరుగవుతుంది. ప్రతి ఒక్క చోటా మనుషులను అనుసంధానం చేయగలిగేది భాష మాత్రమే. అందుకే మాతృభాషతో పాటు అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లాన్ని నేర్చుకోవాలని చెబుతున్నారు.
పొరపాటు ఎక్కడ??
నిజానికి ఈ భాష గురించి అందరూ చేస్తున్న పొరపాటు. దాన్ని మార్కులు ఇచ్చే సబ్జెక్ట్ గా చూడటం. తెలుగులాగా ఇంగ్లీష్ ను కూడా లైఫ్ స్టైల్ లో భాగం చెయ్యకుండా, దాన్ని సరైన విధంగా నేర్పించకుండా ఉండటం. వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వకపోవడం. బహుశా దీన్ని గుర్తించి కార్పోరేట్ పాఠశాలల్లో పూర్తిగా తెలుగు నిషిద్ధం చేసి ఇంగ్లీష్ నే అలవాటు చేస్తున్నట్టున్నారు. కానీ తెలుగు, ఇంగ్లీష్ రెండింటిని పిల్లలకు అలవాటు చేస్తే వారి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది.
నిజం చెప్పాలంటే అత్యుత్తమ మార్కులు లేకపోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల జీవితాల్లో బాగుపడినవాళ్ళు చాలా మంది ఉన్నారు.
మార్గం!!
ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముఖ్యంగా చేయాల్సిన పని ఒకటి ఉంది. భయం తగ్గించుకోవడం, తప్పులు మాట్లాడతామేమో అని, వ్యాకరణ దోషాలు ఉంటాయని, ఎవరైనా నవ్వుతారని, ఎగతాళి చేస్తారని భయపడుతూ దానికి దూరంగా ఉంటే, ఆ ఇంగ్లీష్ కూడా అలాగే సమస్యగా కనిపిస్తుంది.
ఇంగ్లీష్ లో ఉన్న చిన్న ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్, పోయెమ్స్, మొదలైనవి చదువుతూ, ఇంగ్లీష్-తెలుగు నిఘంటువులో పదాలు సందర్భానుసారంగా మారుతున్న అర్థాలను గమనించుకుంటూ అర్థం చేసుకుంటే చాలా తొందరగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది.
కాబట్టి భాషను చూసి భయపడద్దు!! దాన్ని లొంగదీసుకుంటే, అవకాశాలు మనకు లోబడుతాయి.
◆ వెంకటేష్ పువ్వాడ.