ఆత్మహత్యలు వద్దే వద్దు!
posted on Sep 10, 2023 9:30AM
మనిషి ప్రాణం చాలా విలువైనది. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పుడు, కష్టాలను, అడ్డంకులను ఎదుర్కొని విజేతలుగా నిలిచినప్పుడు మనిషిగా పుట్టినందుకు చాలా సంతోషపడతాం. కేవలం అవి మాత్రమే కాదు జీవితంలో ఎంతో సంతోషకరమైన క్షణాలలో ఉన్నప్పుడు ఫలానా వారికి పుట్టినందుకు ఎంత సంతోషంగా ఉన్నామనో, ఈ జీవితం ఇలా సాగుతున్నందుకు మనం అదృష్టవంతులమనో అనుకుంటాం ఖచ్చితంగా. కానీ జీవితంలో చెప్పలేనంత విరక్తి వచ్చి చచ్చిపోవాలని నిర్ణయించుకుని, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే?? ఎంతో గొప్పగా జీవించాల్సిన వాళ్ళు అర్థాంతరంగా జీవితానికి ముగింపు ఇస్తే!! ప్రస్తుత సమాజాన్ని ఎంతో భయపెడుతున్న విషయం ఇదే!! ఏ విషయాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు చాలామంది ఉంటున్నారు.
ఈ ఆత్మహత్యల మీద దృష్టి సారించి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడం రాను రాను పెరుగుతున్న సమస్య. వీటి నమోదు సంఖ్యలు చాలా దిగ్భ్రాంతికరమైన కథనాలు చెబుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8,00,000(ఎనిమిది లక్షల) మంది ప్రజలు మరణిస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం ఆ సంఖ్య పది లక్షలకు దగ్గరగా ఉంది.
మరీ ముఖ్యంగా 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారి మరణానికి ఆత్మహత్య ప్రధాన కారణం అనే విషయం కలవరపెడుతోంది. ప్రయత్నించే ప్రతి 40 మందిలో కనీసం ఒక్కరు అయినా చనిపోతున్నారు. మనిషి జీవించడానికి చాలా గొప్ప గొప్ప అవకాశాలు, మార్గాలు ఉంటాయి అనే విషయం అందరికీ తెలుసు. మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఎందుకు??
ఆత్మహత్యలకు ప్రధాన కారణం!!
ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటే. మందులతో బాగు చేయలేని, ఇదీ అని నిర్ధారించలేని సమస్య అది. ఏమిటా సమస్య అంటే?? మానసిక అనారోగ్యం. మానసిక ఇబ్బందులతో బాధపడేవారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరిలో అర్థం చేసుకునే ఆలోచనా స్థాయిలు తక్కువ. అతిగా ఆలోచించడం ఎక్కువ. ఈ కారణంగా ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి.
ఏం చెయ్యాలి??
కౌన్సెలింగ్ ఇవ్వడం, సపోర్ట్ గా ఉండటం వల్ల ఆత్మహత్యలను నివారించవచ్చు. ప్రతి వ్యక్తి తన కుటుంబంలోని వారితో ఎప్పుడూ దగ్గరగా ఉంటూ, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వారికున్న సమస్యలను చెప్పుకునే స్నేహాభావాన్ని కలిగిస్తే దాదాపుగా ఆత్మహత్య అనే భావనను రానివ్వకుండా చేయచ్చు. ఇతరులకు వారి జీవితాలకు బాధ్యత వహించడానికి, వారి జీవితానికి వారు ఇచ్చుకోవలసిన ప్రాధాన్యత, వారి మీద వారికి ఉండాల్సిన బాధ్యత మొదలైనవి గుర్తుచేయడం కూడా వారిలో ఆత్మహత్య ఆలోచనను రానివ్వకుండా చేయడానికి ఒక గొప్ప మార్గం.
ఆత్మహత్య అనేది అన్ని వయసుల వారిని సమానంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల మానసిక ఆరోగ్యం గురించి చర్చలు జరపడం చాలా ముఖ్యం, ఇతరులు వారు ఎదుర్కొంటున్న కష్ట సమయాల గురించి మాట్లాడటం వల్ల అవసరమైతే వృత్తిపరమైన లేదా మానసిక ఆలోచనలకు సంబంధించిన సహాయం పొందడం సులభం చేస్తుంది.
'టేక్ ఎ మినిట్, చేంజ్ ఎ లైఫ్'
ఒక్క నిమిషం ఆగండి జీవితాన్ని మార్చుకోండి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేసిన ఒక గొప్ప వాక్యం. ఆత్మహత్యలు ఎప్పుడూ తొందరపాటుగా జరిగిపోతుంటాయి. అలాంటి సందర్భంలో ఒక్క నిమిషం ఆగి, జీవితం గురించి, భవిష్యత్తు గురించి, బ్రతకాల్సిన ఆవశ్యకత, జీవితానికి ముఖ్యమైన మార్గాలు వంటివి ఆలోచిస్తే జీవితం చెయ్యిజారిపోదనే విషయం అర్థమవుతుంది.
ఆత్మహత్య నిరోధక దినోత్సవం సందర్భంగా ఈవెంట్‌లు, సమావేశాలు, సెమినార్‌లు చర్చా వేదికలను నిర్వహిస్తారు. ఆత్మహత్యల నివారణకు కొత్త విధానాలను రూపొందిస్తారు. వ్యక్తులలో జీవితం పట్ల అవగాహనను కలిగించడానికి సాధనంగా మీడియాను ఉపయోగించవచ్చు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కుటుంబం, డాక్టర్ల కౌన్సిలింగ్ చాలా ఉపయోగపడుతుంది.
సమాజ పౌరులుగా మన చుట్టూ ఉన్న వారికి మనవంతు సాయం చేయడం అనుసరించాల్సిన విషయమే!! కాబట్టి మీ వంతు మీరూ కృషి చేయండి. ఆత్మహత్యల నివారణకు తోడ్పాటు అందించండి.
◆నిశ్శబ్ద.