ఏపీ బీజేపీలో సోము కర్రపెత్తనం.. సీనియర్ల ఆగ్రహం
posted on Oct 20, 2022 2:20PM
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కమలదళంలో ఉన్న అసంతృప్తి బయటపడుతోంది. ముఖ్యంగా పార్టీ సీనియర్లు ఆయన కర్రపెత్తనం ఏమిటని భగ్గుమంటున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెత్తు పోకడపై.. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని అసంతృప్తిని బహిర్గతం చేశాయి.
కన్నా బయటకు చెప్పారు కానీ, చాలామంది సీనియర్లు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారనడానికి వారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటమే నిదర్శనమని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. కన్నా గళం విప్పడంతో ఇంత కాలం కోర్ కమిటీలో సీనియర్ల నోటికి తాళాలు, ప్రెస్‌మీట్ల అంశంలో అధ్యక్షుడు వీర్రాజు గీసిన లక్ష్మణరేఖ వంటి అంశాలు ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశాలుగా మారాయి. కన్నా వ్యాఖ్యలు ఇప్పటి వరకూ ఏపీ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృత్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమనేలా చేశాయి. జనసేనాని పవన్‌తో సఖ్యత-సమన్వయంలో తమ రాష్ట్ర నాయకత్వం విఫలమయిందంటూ కన్నా వ్యాఖ్యలతో బీజేపీలో ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి.
బీజేపీ-జనసేన పొత్తు కొనసాగాలని కోరుకునే బీజేపీ శ్రేణులు, కన్నా వ్యాఖ్యలకు బహిరంగంగానే మద్దతివ్వడం విశేషం. దీంతో ఏపీ బీజేపీ పరిస్థితులపై అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. చాలా కాలం నుంచే జనసేనతో సమన్వయం విషయంలో సోము నేతృత్వంలోని ఏపీ బీజేపీ విఫలం అవుతూ వస్తున్నదన్న భావన బీజేపీ క్యాడర్ లో నివురుగప్పిన నిప్పులా ఉన్నది.
ఇప్పుడు కన్నా వ్యాఖ్యలతో ఆ నివురు తొలగిపోయినట్లు అయ్యింది. సోము వైఖరితో విసిగిపోయిన పవన్ ఒక సందర్భంగా తాను రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడనని, ఏమైనా ఉంటే ఢిల్లీ నేతలతోనే మాట్లాడుకుంటానని విస్పష్టంగా చెప్పిన సంగతిని బీజేపీ క్యాడరే ఇప్పుడు గుర్తు చేస్తోంది. ఏపీ బీజేపీలోని కొందరు ముఖ్య నేతలు అధికార వైసీపీతో రహస్య స్నేహం కొనసాగిస్తున్నారన్న అనుమానాలు బీజేపీ క్యాడర్ లోనే వ్యక్తమౌతున్నాయి.