అవినీతి రోగానికి... మోదీ (స్టింగ్) ఆపరేషన్!
posted on Dec 13, 2016 11:50AM
.jpg)
నోట్లు రద్దు చేసి, మోదీ దారిన పోయే కంపను నెత్తిన వేసుకున్నారా? నల్లధనం పనిపట్టడం, దొంగ నోట్లు అరికట్టడం మాట అటుంచి కొత్త అవినీతికి ఈ డీమానిటైజేషన్ ద్వారాలు తీసిందా? అవుననే అంటున్నారు చాలా మంది! అందుకు బలమైన సాక్ష్యాలు కూడా లేక పోలేదు. టీటీడీ బోర్డ్ మెంబర్ శేఖర్ రెడ్డి కోట్లాది రూపాయాల కొత్త నోట్లతో పట్టుబడ్డాడు. ఢిల్లీలో ఓ లాయర్ కూడా అట్ట పెట్టెల్లో కొత్త నోట్ల కట్టల్ని దుర్మార్గంగా దాచి పెట్టాడు. ఇలా దేశమంతా గందరగోళంగా మారిపోయింది! దీనికంతటికీ కారణం మోదీ అనాలోచితంగా చేసిన పెద్ద నోట్లే రద్దేనంటున్నారు విమర్శకులు...
నవంబర్ 8న నరేంద్ర మోదీ 500, 1000 నోట్లు చెల్లవూ అంటే అంతా హ్యాపీగా పీలయ్యారు. కాని, నెల గడిచిపోయినా ఇంకా బ్యాంక్ లు, ఏటీఎంల వద్ద క్యూలు అలాగే వుండే సరికి చాలా మంది మోదీకి మద్దతు ఉపసంహరిస్తున్నారు. నోట్ల రద్దు మంచి కన్నా చెడు ఎక్కువ చేసిందని డిసైడ్ అయిపోతున్నారు. కాని, ప్రధాని మాత్రం జరిగిన అరాచకాన్ని అరికట్టే పనుల్లో వున్నట్టు కనిపిస్తుంది. అందుకోసం, గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వమూ చేయని పనులకి ఇప్పటి మోదీ సర్కార్ సిద్ధపడుతోంది. గవర్నమెంటే స్టింగ్ ఆపరేషన్లు చేయించి అవినీతి అనకొండల్ని అడ్డంగా పట్టేస్తోంది!
అవినీతిపరులు, ఆక్రమార్కులు కొత్త నోట్లు ఎలా సంపాదిస్తున్నారు? సామాన్యుడు లైన్లో నిలబడి ఒక్క రెండు వేల నోటు సాధించాలంటేనే పెద్ద సర్కాస్ చేయాల్సి వస్తోంది. కాని, నల్ల త్రాచులు మాత్రం కొత్త నోట్లని తమ పుట్టల్లో భద్రంగా బ్లాక్ చేసేస్తున్నాయి. దీనికి పూర్తి బాధ్యత బ్యాంకుల్లోని ఉన్నతాధికారులదే. వాళ్ల కక్కుర్తి లేకుండా కోట్లాది రూపాయల కొత్త నోట్లు ప్రైవేట్ వ్యక్తుల వద్దకి రావు. అందుకే, వారి మీదే స్టింగ్ ఆపరేషన్ చేయిస్తున్నారట మోదీ! దేశ వ్యాప్తంగా వున్న 625 పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ బ్రాంచీలపై నిఘా పెట్టిస్తే 425 బ్యాంకుల్లో ఆక్రమాలు జరిగినట్టు తేలిందట. చాలా మంది బ్యాంక్ మ్యానేజర్లు తమ కమీషన్ కోసం దేశ భవిష్యత్తుతోనే ఆటలాడుకున్నారు. అంతే కాదు, బలిసినోళ్లకి అప్పన్నంగా కొత్త నోట్లు ఇచ్చి బక్కటోళ్లకి నరకం కనిపించేలా చేశారు. ఇప్పుడు వాళ్లంతా స్టింగ్ లో ఇరుక్కుని రింగులో నిలబడ్డారు. వేటు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు...
సాధారణంగా ఎవరెవరో ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై స్టింగ్ ఆపరేషన్లు చేస్తుంటారు. కాని, ఈసారి సర్కారే స్టింగ్ సంధించింది. కొత్త నోట్లతో సరికొత్త అవినీతికి పాల్పడ్డ ఎంత మందిపై చర్య తీసుకుంటారో చూడాలి. కాకపోతే, కోట్లాది సామాన్య జనం కష్టాలకు కారణమైన వాళ్లందర్నీ అత్యంత కఠినంగా మాత్రం శిక్షించాల్సిందే...