బాబ్లీనీ కూల్చేయాల్సిందే
posted on Oct 16, 2012 11:16AM
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టును తొలగించి తీరాల్సిందేనని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. బాబ్లీ వివాదంపై సోమవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అనీల్, తెదేపా నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మండవ వెంకటేశ్వర రావు, రమణ, టీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, విద్యాసాగర రావు, సీపీఐ నాయకుడు చాడ వెంకట రెడ్డి హాజరయ్యారు. బాబ్లీ ప్రాజెక్టు కొనసాగితే తెలంగాణలోని పలు జిల్లాలు ఎడారిగా మారుతాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బాబ్లీతో పాటు మరో 13 మినీ ప్రాజెక్టుల పైన కూడా దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చారు. మంగళవారం సుప్రీం కోర్టులో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇరు రాష్ట్రాల న్యాయవాదులు తుది వాదనలు వినిపించనున్నారు.