డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు
posted on Feb 5, 2015 8:10AM
.jpg)
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈరోజే చివరి రోజు. కనుక దాదాపు నెలరోజులుగా డిల్లీలో బీజేపీ, ఆమాద్మీ పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచార యుద్ధం ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు ముగియబోతోంది. క్రితం సారితో పోలిస్తే, ఈసారి బీజేపీ, అమాద్మీ పార్టీ రెండూ కూడా ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించాలానే పట్టుదలతో చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎంతో ఘన చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ, ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటాన్ని ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ప్రచారం కీలక దశకు చేరుకొంటున్న కొద్దీ బీజేపీ, ఆమాద్మీ పార్టీలు రెండూ కూడా తమ వద్ద ఉన్న అన్ని అస్త్ర శస్త్రాలు బయటకి తీసి ఒకదానిపై మరొకటి ప్రయోగించుకొంటున్నాయి. బీజేపీ ఈవిధంగా పోరాడటం ఎవరికీ ఆశ్చర్యం కలిగించకపోయినా, ఆమాద్మీ పార్టీ విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా తన సర్వశక్తులు ఒడ్డి బీజేపీతో పోరాడటం చాలా ఆశ్చర్యంగానే ఉంది. అందుకు బలమయిన కారణమే ఉంది. ఈసారి ఆమాద్మీ పార్టీ ఎన్నికలలో గెలవలేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఆ పార్టీని సజీవంగా నిలుపుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే ఇదే తన అంతిమ పోరాటంగా భావించి బీజేపీతో యుద్ధం చేస్తోంది. మరి డిల్లీ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేసి గెలిపించుకొంటారో మరి కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. ఫిబ్రవరి 7వ తేదీన డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.