అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం లక్ష్యం.. లోకేష్

పాలన కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేర నారాలోకేష్ చేపట్టిన పాదయాత్ర సోమవారం (ఏప్రిల్ 24) 1020 కిలోమీటర్లు పూర్తయ్యింది.  గణెళికల్లు శివారులో వద్ద రైతులతో మాటామంతి నిర్వహించారు. గణెళికల్లులో లోకేశ్‌కు గ్రామస్థులు గజమాలతో  సన్మానం చేశారు. జాలిమంచి క్రాస్‌ వద్ద మహిళలు, చిన్నారులు హారతులతో లోకేశ్‌కు ఆహ్వానం పలికారు. పాండవగల్లు చెరువును ఆక్రమదారుల నుంచి రక్షించాలని గ్రామస్థులు లోకేశ్‌కు వినతి చేశారు. కుప్పగల్‌లో గ్రామస్థులు మేళతాళాలతో లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. కుప్పగల్‌ శివారులో విడిది కేంద్రానికి చేరుకున్న లోకేశ్‌ బీసీలతో ముఖాముఖి మాట్లాడారు.

పెద్దతుంబళంకు చేరుకున్న లోకేశ్‌ మేళతాళలతో, పులవర్షం కురిపించారు. పెద్దతుంబళం శివారులో రాత్రి బస చేసే విడిది కేంద్రానికి చేరుకున్న లోకేశ్‌, 78వ రోజు 15.2 కి.విూ.నడిచారు. ఇప్పటి వరకు 1020 కి.విూ. యాత్రను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచ్ లకు తెలుగుదేశం ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకు వస్తుందని అన్నారు. ఒక్క ఏడాది ఓపికపట్టండి చాలు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, సర్పంచ్ ల హక్కులను తమ ప్రభుత్వం కాపాడుతుందని లోకేష్ చెప్పారు.

జగన్ సర్కార్ సర్పంచ్ ల హక్కులను పూర్తిగా కాలరాసిందని, వారికి అందాల్సిన నిధులను పక్కదారి పట్టించదని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో మాదిరిగా   సర్పంచ్‌ అకౌంట్లలోనే  నేరుగా నిధులు వేస్తామని హావిూ ఇచ్చారు. సర్పంచ్‌ల గౌరవాన్ని కాపాడుతామన్నారు. తాను హైదరాబాద్‌లో పుట్టి పెరిగానని, సీమ ప్లలెల్లో పాదయాత్ర చేస్తుంటే చాలా బాధేస్తోందని  లోకేష్‌ఆవేదన వ్యక్తం చేశారు. ప ల్లెల్లో రోడ్లు, తాగునీరు, డైనేజీ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అలాగే గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు.

ఇలా ఉండగా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా జనం అభిమానంతో ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు.  రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలలో పనులను వదలి  వచ్చి మరీ యువ నేతతో  అడుగు కలుపుతున్నారు. తమ కష్టాలు, బాధలను వినిపిస్తూ ముందుకు సాగుతున్నారు.  కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని, రాయలసీమలో కరువు నివారణకు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు నీరు ఇచ్చే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని హావిూ ఇచ్చారు. దామాషా ప్రకారం బీసీ కులాలకు నిధులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వివరించారు. దూదేకుల, ముస్లింలను ఆదుకుంటామని చెప్పారు.