దావూద్.. ఇక నువ్వు వచ్చేయ్
posted on May 13, 2015 7:58AM

హాయ్ దావూద్ ఇబ్రహీం.. ఇప్పుడు నీ గురించి ఇండియాలో ఒకటే చర్చ. మా అధికార, ప్రతిపక్ష పార్టీలో నీ గురించే మాట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నాయి. నువ్వు అప్పుడెప్పుడో లొంగిపోతానని అంటే, గవర్నమెంటోళ్ళే వద్దులేబ్బా అని నీకు చెప్పారంటగా. ఆ విషయంలో కూడా ఇప్పుడు బాగా రచ్చ రచ్చ జరుగుతోంది. నువ్వు ఎక్కడున్నావో, ఎలావున్నావో, అసలు వున్నావో లేవో ఇండియా గవర్నమెంటోళ్ళకి కూడా తెలియని పరిస్థితి. కాకపోతే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం నువ్వు పాకిస్థాన్‌లో వున్నావని డిసైడ్ చేశారు. నిన్ను సాధ్యమైనంత త్వరలో పట్టేసుకుంటామని చెప్పారు. నిన్ను పట్టుకునేవరకూ విశ్రమించనని ప్రకటించేశారు. పాపం పెద్దాయన.. ఆయన ఆరోగ్యం అంతంతమాత్రం. అన్నమాటకు కట్టుబడి ఎక్కువకాలం విశ్రమించకపోతే ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి ఆ పోస్టు ఖాళీ అయ్యే ప్రమాదం వుంది. అంచేత నువ్వు వెంటనే పట్టుబడిపోయి ఇండియాకి వచ్చేసెయ్. ఏంటీ... నువ్వు పట్టుబడితే జైల్లో వేస్తారని, చంపేస్తారని భయపడుతున్నావా? పిచ్చి దావూదూ... అవన్నీ పాత రోజులు... ఇప్పుడు మన ఇండియాలో పరిస్థితులన్నీ మారిపోయాయ్. అంచేత నువ్వు అలాంటి భయాలేవీ పెట్టుకోకుండా ఇండియాకి వచ్చేసెయ్.
అయినా నువ్వు ఎందుకలా భయపడుతున్నావ్? అసలు నువ్వేం చేశావని? పాపం ఏదో వ్యాపారం చేసుకున్నావ్. దానికి ప్రభుత్వం మాఫియా అని పేరు పెట్టింది. ఓ ఫైన్ మార్నింగ్ ముంబైలో దీపావళి జరుపుకున్నావ్. కాకపోతే నువ్వు పెట్టిన బాంబులతో పాటు జనమూ పేలిపోయారు. అది నీ తప్పు కాదు.. నువ్వు బాంబులు పెట్టించిన చోటకి వచ్చిన జనానిదే తప్పు. నువ్విప్పుడు ఇండియాకి తిరిగి వచ్చేసి ఈ రకంగా వాదించి గెలవొచ్చు. నీ తరఫున వాదించడానికి రామ్ జెఠ్మలానీ లాంటి లాయర్లు మన దగ్గర బోలెడంతమంది వున్నారు. ఒకవేళ పొరపాటుగా నీకు శిక్ష పడినా డోన్ట్ వర్రీ.. ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు... ఆ కోర్టు కాకపోతే మరో కోర్టు... మన దేశంలో కోర్టులకు కొదువ లేదు. న్యాయానికి లోటు లేదు. ఒక కోర్టు ఓ పాతికేళ్ళపాటు నీ కేసులని విచారణ జరిపి నువ్వు నరరూప రాక్షసుడివని డిసైడ్ చేసిందనుకో, మరోకోర్టు రెండ్రోజుల్లోనే నువ్వు శాంతిదూతవి అని తీర్పు ఇచ్చేస్తుంది. కొంతకాలం జైల్లో ఉండాల్సి వచ్చినా కంగారుపడాల్సిన పనేం లేదు. బయటికంటే ఎక్కువ ఫెసిలిటీలు జైల్లోనే వుంటాయి. అంచేత ఇంకేమీ డౌట్లు పెట్టుకోకుండా ఇండియాకి వచ్చేయ్... నిన్ను చూసి కూడా చాలా రోజులైంది.