ఎంతమాటన్నారు దాసరి గారూ!


తాను రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని ప్రముఖ దర్శకుడు, కేంద్ర మంత్రి డాక్టర్ దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు యావత్ తెలుగువారు షాక్‌కి గురయ్యేలా చేశాయి. మరీ సున్నిత హృదయులైతే కన్నీరు మున్నీరు అయ్యేలా చేశాయి. కొంతమంది అయితే గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇంకొంతమంది సీనియర్ సిటిజన్స్ అయితే భగవంతుడా ఆ మహానుభావుడి నోటి వెంట ఈ మాట వినడానికేనా ఇంకా మేం బతికి వుంది అని కుమిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిజాయితీకి నిలువుటద్దంగా, పేద, బడుగు, బలహీన వర్గాల ఆకలి తీర్చిన మహా నాయకుడిగా పేరు గడించిన ఆయన రాజకీయాల్లోకి రాకపోతే పేదలు అన్యాయమైపోయేవారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు అద్భుతం, అమోఘం, అపూర్వం, అనిర్వచనీయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత అద్భుతంగా వుందంటే ఆయనే కారణం. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో తులతూగుతోందంటే అంతా ఆయన చలవే. ఆయనే రాజకీయాల్లోకి రాకపోతే ఈ తెలుగుజాతి వాణిని ఢిల్లీలో వినిపించే దిక్కూమొక్కూ లేకుండా పోయేది. అసలు ఆయన తనంతట తాను రాజకీయాల్లోకి రాలేదు. రాత్రనక, పగలనక నిద్రాహారాలు మాని ఆయన తెలుగుజాతికి చేసిన సేవను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఆయనను ఎంపీగా, కేంద్రమంత్రిగా చేస్తే తెలుగువాళ్ళంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతారని భావించి ఆయనకు పదవులు అప్పగించింది. ఆ సమయంలో ప్రతి తెలుగు హృదయం ఆనందంతో పులకరించిపోయింది.

 

ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలు నిజంగా నభూతో నభవిష్యతి. ఆ సమయంలో ఆయన తన పలుకుబడిని ఉపయోగించి ఎన్నో ప్రాజెక్టులు ఏపీకి వచ్చేలా చేశారు. ఎన్నో పథకాలు ఏపీలో అమలయ్యేలా చేశారు. మా రాష్ట్రానికి నిధులు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టి లక్షల కోట్ల నిధులు మంజూరయ్యేలా చేశారు. బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఆయన ఎంతో ప్రతిభావంతంగా పనిచేశారు. చుట్టూ బొగ్గు వున్నా తాను మాత్రం స్ఫటికంలా మెరిశారు. అయితే ఇంత నిజాయితీపరుడి మీద ఎవరో కుట్ర పన్ని ఆయన్ని అవినీతి కేసులో ఇరికించారు. మల్లెపువ్వులాంటి ఆయనకు బొగ్గు మసి పూశారు. కొంతమంది గిట్టనివాళ్ళు అంటున్నట్టుగా డాక్టర్ దాసరి నారాయణరావు ‘బొగ్గులపులి’ కాదు.. ఆ బొగ్గును కాల్చితే వచ్చే ‘నిప్పు’. ఆయన కూడా ఏదో ఒకరోజు ఒక జయలలితలాగా తనమీద వున్న కేసుల నుంచి బయటపడతారు. తనను తాను నిప్పులాంటి మనిషి అని రుజువు చేసుకుంటారు. తెలుగు ప్రజల హృదయాలలో వెలుగు నింపుతారు.

 

మరి ఇలాంటి నిజాయితీపరుడైన వ్యక్తి రాజకీయాల్లోకి రాకపోతే... మైగాడ్... ఊహించడానికి కూడా ధైర్యం చాలడం లేదు. అందుకే, అయ్యా దాసరి గారూ, తమరు ఇంకెప్పుడూ రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని అనకండి. ఇప్పటికే ఆవేదనతో కుమిలిపోతున్న మా హృదయాలను మరింత ఆవేదనకు గురి చేయకండి. మీలాంటి నాయకులే ఈ దేశానికి ఆదర్శం. మీలాంటి గొప్ప నాయకులే రాబోయే తరాలకు మార్గదర్శకులు. కొన్ని శతాబ్దాల తర్వాత దాసరి నారాయణరావు అనే గొప్ప రాజకీయ నాయకుడు రక్తమాంసాలతో ఈ భూమ్మీద తిరిగాడని చెబితే జనం నమ్మలేనంత గొప్ప రాజకీయ నాయకుడు మీరు. అందుకే మీరు ఇంకా రాజకీయాల్లో కొనసాగాలి. వీలైతే మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాలి. అది కూడా బొగ్గు శాఖ మంత్రి అయితే ఈ తెలుగుజాతి మొత్తం ఎంతో సంతోషిస్తుంది.